
● బ్యాంకు ఖాతాలు, నగదు ఫ్రీజ్ ● సైబర్ నేరాల నియంత్రణల
చింతలమానెపల్లి: జిల్లాలో అనేక మంది బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు దర్యాప్తులో భాగంగా లావాదేవీలు జరిగిన అనేక ఖాతాలపై దృష్టి సారిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగదు బదిలీ చేయకుండా ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాల ను పలు రకాలుగా వినియోగించుకోవడమే ఇందు కు కారణం. అయితే నేరంతో సంబంధం లేకున్నా ఖాతాలు స్తంభించిపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సైబర్‌క్రైం నానాటికీ కొత్త దారులు వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆర్థిక నేరగాళ్ల వలకు అమాయకులు చిక్కుతున్నారు.
జిల్లాలో బాధితులు
ఇటీవల బ్యాంకు ఖాతాల్లోని నగదును వినియోగించుకోలేక పోతున్నామని బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. ఖాతాలు స్తంభించినట్లు, ఖాతాల్లోని కొంత నగదు వినియోగించుకోలేక పోతున్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల నుంచి ఈ ఫిర్యాదులు వస్తున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సదరు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. ఆ ఖాతాలు సైబర్ క్రైం ఘటనల్లో స్తంభించినట్లు గుర్తించారు. నగదుకోసం పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఖాతాల్లోని నగదు వినియోగించుకోలేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి బాధితులు వేల సంఖ్యల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
డిజిటల్ లావాదేవీలే కారణం
బాధితుల్లో ప్రధానంగా దుకాణదారులు, పెట్రోల్ బంకులు, ఆన్‌లైన్ కేంద్రాలు, నగదు చెల్లింపు కేంద్రాల వారు ఉంటున్నారు. సైబర్‌క్రైం ద్వారా అక్రమాలకు పాల్పడిన వారు ఆ మొత్తాన్ని రకరకాల మార్గాల్లో నగదుగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, రమ్మీ వంటి ఆన్‌లైన్ ఆటలు, ఆన్‌లైన్ షాపింగ్ ఆధారంగా పెట్టుబడి పెడుతున్నా రు. ఆన్‌లైన్ యాప్స్, గేమ్స్‌లో గెలుచుకున్న వారు పట్టణాలు, గ్రామాల్లో నగదును విత్‌డ్రా చేస్తున్నా రు. దుకాణదారులు, పెట్రోల్ పంపులు, ఆన్‌లైన్ చెల్లింపు కేంద్రాలతోపాటు నగదు ఉన్నవారి నుంచి చైన్ పద్ధతిలో నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ..
సైబర్ నేరాలకు అవకాశం ఉన్న బెట్టింగ్ యాప్స్, ఇతర ఆన్‌లైన్ గేమ్స్‌పై తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నేర దర్యాప్తు సంస్థలు గతంలో పలువురు ప్రముఖులపై సైతం కేసులు నమోదు చేశాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. పొరుగు రాష్ట్రంలో ఇలా సంపాదించిన ఆన్‌లైన్ సొమ్మును మన జిల్లాల్లో చెల్లింపులు చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల అంచనా. దీంతో పాటు ఫేక్ జీపీఎస్ ఆధారంగా అప్లికేషన్లు వినియోగించి సైబర్ మోసాల్లో పలువురు భాగస్వాములు అవుతున్నారు.
స్థానికంగా పరిష్కారం లభించదు
ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ మోసాలపై పోలీసు శాఖ నిఘా ఉంది. ఇతర రాష్ట్రాలలో నమోదైన సైబర్ క్రైం ఘటనల్లో ఖాతాలు స్తంభించినపుడు సదరు బ్యాంకులకు సమాచారం ఉంటుంది. ఆయా ఖాతాల వివరాలను బ్యాంకుకు మెయిల్, ఇతర మార్గాల్లో సమాచారం అందిస్తారు. నేరుగా పాల్గొనకపోయినప్పటికీ సహకరించిన కూడా నేరంలో పాల్గొన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఖాతాల్లో నగదు స్తంభించిన వారికి స్థానికంగా పరిష్కారం లభించకపోవచ్చు. కేసు నమోదైన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి సైబర్ నేరానికి పాల్పడలేదని నిరూపించుకుంటే నగదు విడిపించుకోవచ్చు. గుర్తు తెలి యని వ్యక్తులు, లేదా గుర్తింపు లేని సంస్థలతో లావాదేవీలు చేయకపోవడమే మంచిది.
– రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్