పెన్షన్‌.. ఊరట | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌.. ఊరట

Jul 31 2025 7:40 AM | Updated on Jul 31 2025 8:34 AM

పెన్షన్‌.. ఊరట

పెన్షన్‌.. ఊరట

● 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ ● వర్తింపజేయాలని హైకోర్టు తీర్పు ● ఫలించిన టీచర్ల న్యాయ పోరాటం

ఆదిలాబాద్‌టౌన్‌: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. పాత పెన్షన్‌ విధానం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ టీచర్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రెండు దశాబ్దాల తర్వాత సమస్య పరిష్కారానికి నోచుకోవడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. న్యాయస్థాన తీర్పుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 746 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ అమలు చేశారు. ఈ నిర్ణయానికి ముందే 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకం జరిగినప్పటికీ పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో వీరికి సీపీఎస్‌ అమలు చేశారు. దీంతో 2019, 2020 సంవత్సరాల్లో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. మంగళవారం హైకోర్టు డీఎస్సీ 2003 టీచర్లకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఉమ్మడి జిల్లాలో..

డీఎస్సీ 2003లో ఉమ్మడి జిల్లాలో 746 పోస్టులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలో 317 పోస్టులకు నియామకాలు చేపట్టగా, మైదాన ప్రాంతంలో 429 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో ఎస్జీటీ పోస్టులు 372, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 264, భాషా పండిత పోస్టులు 98, పీఈటీ పోస్టులు 12 ఉన్నాయి. ఈ డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారు.

నాటి నుంచి నేటి వరకు..

2003 నవంబర్‌ 14న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కాగా, అభ్యర్థులు పరీక్ష రాశారు. ఎంపికైన వారికి 2005 నవంబర్‌ 23న నియామకాలు చేపట్టారు. మరోవైపు 2004 సెప్టెంబర్‌ 1 నుంచి సీపీఎస్‌ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం నియామకాలు చేపట్టినప్పటి నుంచి సీపీఎస్‌ అమలవుతుందని చెప్పడంతో వీరికి ఇప్పటివరకు అదే అమలు చేశారు. అయితే 2019లో వీరితో నియామకమైన న్యాయశాఖ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు పత్రాలతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా తమకు సైతం పాత పెన్షన్‌ విధానం వర్తింపజేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement