
ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు
● ఎమ్మెల్సీ దండె విఠల్
బెజ్జూర్(సిర్పూర్): ప్రజలు ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, జీవో 49 పూర్తిగా రద్దయ్యేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని దండె విఠల్ స్పష్టం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని, ప్రజలకు అన్యాయం చేసే ఏ జీవోను ఇక్కడ అమలు చేయనీయమన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బెజ్జూర్ మండలానికి 322 నూతన రేషన్ కార్డులు జారీ కాగా, 985 మంది పేర్లు కార్డుల్లో కొత్తగా చేర్చామని తెలిపారు. అర్హులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది విచారణ జరిపి కార్డుల జారీకి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో బండారి ప్రవీణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వంతో మేలు..
పెంచికల్‌పేట్(సిర్పూర్): ప్రజా ప్రభుత్వంతో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రేషన్ కార్డులను కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి అందించారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులను పంపిణీ చేయలేదని విమర్శించారు. పెంచికల్‌పేట్ మండలంలో 109 రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకుని వచ్చారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహాసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు పాల్గొన్నారు.