
విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
రెబ్బెన(ఆసిఫాబాద్): విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలను బుధవారం సందర్శించారు. హాజరు పట్టికతోపాటు ఇతర పాఠశాల రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ, విద్యా సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. మెనూ ప్రకారం రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
గ్రామాల్లో సీజన్ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుతో పాటు ల్యాబ్, మెడిసిన్ రూంలు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు. డీపీవో భిక్షపతి, ఎంపీడీవో శంకరమ్మ, ఎంఈవో వెంకటేశ్వర్లు, వైద్యాధికారి సుజిత్, సిబ్బంది పాల్గొన్నారు.