
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
కాగజ్‌నగర్‌టౌన్: రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, విధుల్లో నిర్ల్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి సందర్శించారు. ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఆస్పత్రులను సందర్శించామని, సమస్యలు, సేవల తీరుపై నివేదిక అందిస్తామని తెలిపారు. కాగజ్‌నగర్ సీహెచ్‌సీలో వసతుల కల్పన, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ స్టాఫ్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శానిటేషన్ వర్కర్లు మూడేళ్లుగా పీఎఫ్ డబ్బులు సొసైటీ కట్టడంలేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన కిందిస్థాయి సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వేతనాలను అందిస్తుందని తెలిపారు. నిర్లక్ష్యం చేసే వారికి కాంట్రాక్టు ఇచ్చి ప్రభుత్వం పేరు బద్నాం చేస్తున్నారని సూపరింటెండెంట్ చెన్నకేశవ్‌రావుపై మండిపడ్డారు. వెంటనే సదరు సొసైటీని రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ 30 పడకల ఆస్పత్రి త్వరలో 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చెందనుందని, టెండర్లు పూర్తయయ్యాయని తెలిపారు. త్వరలోనే స్థలాన్ని సేకరిస్తామన్నారు. కాగజ్‌నగర్ సీహెచ్‌సీలో గైనకాలజిస్టుల కొరత ఉందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే బెజ్జూర్‌లో 2015లో 30 పడకల ఆస్పత్రి మంజూరైనా శంకుస్థాపనకే పరిమితమైందని ఎమ్మెల్యే తెలిపారు. నూతన ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీవీవీపీ సూపరింటెండెంట్ జితేందర్, సీనియర్ అసిస్టెంట్ నరేశ్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
జైనూర్: సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రావు, వైద్యాధికారి అశోక్, సహకార సంఘం చైర్మన్ హన్నుపటేల్, నాయకులు లక్ష్మణ్ యాదవ్, అంబాజీరావు తదితరులు ఉన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, సూపరింటెండెంట్ చెన్నకేశవ్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.