
వసతుల కల్పనకు పెద్దపీట
పెంచికల్‌పేట్(సిర్పూర్): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. జాతీయ నూతన విద్యావిధానం అమలు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పీఎంశ్రీ పాఠశాలలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాలలో పీఎంశ్రీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించారు. డిజిటల్ బోధన, ల్యాబ్స్, గ్రంథాలయం పరిశీలించి, ప్యానల్ బోర్డుల ద్వారా బోధన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రగతితోపాటు గతేడాది పరీక్ష ఫలితాలపై ఆరా తీశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. రానున్న రోజుల్లో పీఎంశ్రీ కింద మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపటనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ నిర్మల, ఎస్సై అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.