
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కెరమెరి(ఆసిఫాబాద్): పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. జ్వరపీడితుల వివరాలు తెలుసుకున్నారు. మందుల కోసం చీటీలు ఎందుకు రాసి ఇస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా సిబ్బంది గైర్హాజరు కావొద్దన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో సీతారాం, డాక్టర్ వినోద్, ఎంపీడీవో అంజద్‌పాషా ఉన్నారు.
నాణ్యతలేని సరుకులు వినియోగిస్తే చర్యలు
విద్యార్థుల భోజనం కోసం నాణ్యత లేని సరుకులు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హెచ్చరించారు. మండలంలోని మోడి కేజీబీవీని సందర్శించారు. విద్యాలయ పరిసరాలు, మెనూ పట్టిక, వంటశాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. వందశాతం ఉత్తీర్ణతపై దృష్టి సారించాలని సూచించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం కేజీబీవీలపై ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, ప్రత్యేకాధికారి వెంకటేశ్, ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.