
వంట తంటాలకు చెల్లు!
● ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు అందించేందుకు నిర్ణయం ● కనెక్షన్లు లేని పాఠశాలల వివరాలు సేకరించిన సర్కారు ● జిల్లాలో 745 గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రతిపాదనలు ● తీరనున్న కట్టెల పొయ్యి కష్టాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్యాస్ కనెక్షన్లు లేనివాటి వివరాలు ఇప్పటికే సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాయి. ప్రతీ పాఠశాలలో పగటిపూట కోడిగుడ్డుతో కూడిన భోజనం ప్రభుత్వాలు అందిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా అవి మూలనపడ్డాయి. నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యిల మీదే ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అందుబాటులో 250 మాత్రమే..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 995 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. 47,770 మంది విద్యార్థులకు ప్రతీరోజు భోజనం అందిస్తున్నారు. కేవలం 250 పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్, స్టౌవ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని స్కూళ్లకు సిలిండర్లు, స్టౌవ్‌లు అందించినా వివిధ కారణాలతో కొన్నాళ్లకే మూలనపడ్డాయి. అప్పటి నుంచి నిర్వాహకులు కట్టెల పొయ్యిల మీద వంటలు వండుతున్నారు. వంట చేసే సమయంలో వెలువడే పొగతో అనేక అవస్థలకు గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోపాటు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు అందించేందుకు కనెక్షన్లు లేని పాఠశాలల వివరాలు సేకరించింది. జిల్లాలో 745 పాఠశాలల్లో కనెక్షన్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. త్వరలోనే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్ స్టౌవ్‌లు రానున్నాయి. కట్టెల పొయ్యిమీద వండితే వంట పాత్రలు సైతం శుభ్రం చేసేందుకు రెక్కలు ముక్కలు చేసుకునేవారు. పొగతో మసిబారిన పాత్రలు కడిగేందుకు అనేక అవస్థలకు గురవుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు అందిస్తే ఆ కష్టాలూ తీరనున్నాయి. అయితే ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు అందిస్తుంది.. ఏ పథకం ద్వారా పంపిణీ చేస్తుంది.. అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పెరిగిన మెస్ చార్జీలు
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెస్ చార్జీలను ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పెంచారు. పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరల నేపథ్యంలో అమలులో ఉన్న మెస్ చార్జీలు ఆశించిన తీరుగా లేవు. 1 నుంచి 5వ తరగతి తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 చెల్లిస్తుండగా.. 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.10.17 చొప్పున, 9, 10 తరగతి వారికి రూ.13.17 చొప్పున చెల్లిస్తున్నారు. రోజు విడిచి రోజు ప్రతీ విద్యార్థికి కోడిగుడ్డు సైతం అందిస్తుండగా, దాని కోసం ప్రభుత్వం ఒక్కో కోడిగుడ్డుకు రూ.6 చెల్లిస్తుంది. ఏ రోజైనా విద్యార్థులకు గుడ్డు అందించని పక్షంలో బిల్లులో కోడిగుడ్డు బిల్లును కట్ చేసి.. కేవలం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లు మాత్రమే నిర్వాహకులకు చెల్లిస్తారు.
సిలిండర్ల భారం ఎవరిపైనో..?
మధ్యాహ్న భోజనాల తయారీ కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల భారం ప్రభుత్వమే భరిస్తుందా లేక నిర్వాహకులపై వేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో అందించిన గ్యాస్ కనెక్షన్లకు సిలిండర్ల భారాన్ని నిర్వాకులే భరించారు. దీంతో చాలామంది భారం మోయలేక గ్యాస్ విని యోగించడమే మానేశారు. పట్టణ ప్రాంతా లతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు తక్కువ ధరకే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు సరిపడా వంటచెరుకు కోసం సుమారు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో వంటచెరు కు కోసం అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో నెలకు సరిపడా వంటచెరుకుకు సుమారు రూ.3వేల వరకు ఖ ర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు అవసరమైన సిలిండర్లు ఉచితంగా అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
కనీస వేతనాలు అమలు చేయాలి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అమలు చేయలేదు. రూ.26వేల కనీస వేతనం అందించాలనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ అందించాలని నిర్ణయించడం శుభపరిణామం. వెంటనే కనెక్షన్లు అందించి ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలి. కార్మికులకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. – బోగే ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉచితంగా సిలిండర్లు అందించాలి
మధ్యాహ్న భోజనాలు తయారు చేసేందుకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు ఇస్తామని చెబుతోంది. అయితే సిలిండర్లను ఉచితంగా అందించాలే. ఇప్పటివరకు మేమే కట్టెలు కొని వంట చేస్తున్నాం. కట్టెల పొయ్యితో వచ్చే పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చేసేదేమీ లేక కష్టపడి పిల్లల కోసం వంట వండుతున్నాం.
– ఎర్ర కాంతమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు, సిర్పూర్(టి)

వంట తంటాలకు చెల్లు!

వంట తంటాలకు చెల్లు!

వంట తంటాలకు చెల్లు!