
‘మధ్యాహ్న’ కార్మికుల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: సమస్యలు పరిష్కరించాలని జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం మ ధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు, 10 నెలల కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణమాచారి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణ ఈ కుబేర్ నుంచి మినహాయించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ పాఠశాలకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం అమలు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలని, నగదు బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6న విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల ధర్నాకు సీపీఎం నాయకులు దినకర్, ఆనంద్ మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు.