ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి చేపడుతున్న దశలవారీ పోరా టాల్లో భాగంగా ఆగస్టు 1న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు యూఎస్‌పీసీ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏ చెల్లించాలని, పీఆర్‌సీ అమలు చేయాలని, 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాకు పంపించాలని, విరమణ పొందిన వారికి బకాయిలు చెల్లించాలన్నారు. జీవో 25 సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం పేస్కేల్ ఇవ్వాలని, గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్, పార్ట్‌టైం, ఔట్‌సోర్సింగ్ టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జాదవ్ కిరణ్, హేమంత్ షిండే, తంగడిపల్లి రమేశ్, తారాచంద్, రవికుమార్, సంతోష్, శ్రీకర్ పాల్గొన్నారు.