
విన్నవించి.. పరిష్కారం కోరి
● ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికారులకు సమస్యలు విన్నవించి పరిష్కరించాలని కోరారు. అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం.డేవిడ్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని జైనూర్ మండలం కోహినూర్‌కు చెందిన ఆడె శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. తన భర్త మరణించాడని వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం దాంపూర్‌కు చెందిన కొర్పెత శారదాబాయి విన్నవించింది. 2023లో ఎస్‌డీఎఫ్ నిధుల కింద నిర్మించిన రహదారి బిల్లులు చెల్లించాలని రెబ్బెన మండలం తక్కళ్లపెల్లికి చెందిన పుప్పాల వేణుగోపాల్ అర్జీ సమర్పించాడు. తన అసైన్డ్ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారని, ఈ విషయమై న్యాయం చేయాలని దహెగాం మండలం గిరవెల్లికి చెందిన దువ్వుట నానయ్య వేడుకున్నాడు. ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కెరమెరి మండలం ఇందాపూర్‌కు చెందిన దుర్గం గంగుబాయి దరఖాస్తు చేసుకుంది. వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన బామ్నె యశోద వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరింది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన అనంతుల విజయ, బాబాపూర్‌కు చెందిన ఇందూరి లక్ష్మి వేర్వేరుగా అర్జీ పెట్టుకున్నారు. రెబ్బెన మండలంలో జాతీయ రహదారిలో భూమి కోల్పోయానని, కొంత భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారని, మిగిలిన పరిహారం ఇప్పించాలని మండల కేంద్రానికి చెందిన బొమ్మెన సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నాడు.
పేర్లు తొలగించారు
‘మేము ఇళ్లు లేని నిరుపేదలం. మాకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, జాబితా నుంచి పేర్లు తొలగించి ఇతరులకు కేటాయించారు. నిరుపేదలైన మాకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి.. ’ అని రెబ్బెన మండలం జక్కులపల్లికి చెందిన ముస్కు స్వప్న, జాడి కమల, నీరటి మొండక్క, దాగం అనూష, కొల్లూరి లక్ష్మి తదితరులు వేడుకున్నారు.
మీసేవ కేంద్రం కేటాయించాలి
నేను ఆదివాసీ మహిళను. డిగ్రీ పూర్తి చేసి, ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నాను. మా గ్రామంలో మీసేవ కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో మీసేవ కేంద్రం కేటాయించి నాకు ఉపాధి కల్పించాలి.
– మెస్రం సరస్వతి, జాంగూడ, మం.జైనూర్
ఆధార్‌కార్డు ఇప్పించాలి
నాకు సుమారు 70 ఏళ్లు ఉన్నాయి. ఆధార్ కార్డు లేకపోవడంతో ఆసరా పింఛన్ రావడం లేదు. వృద్ధాప్యంలో ఆర్థికంగా అవస్థలు పడుతున్నాను. ఆధార్‌కార్డు ఇప్పించి, ఆసరా పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
– నాగోష పోచాలు, ఇందాని, మం.వాంకిడి

విన్నవించి.. పరిష్కారం కోరి

విన్నవించి.. పరిష్కారం కోరి

విన్నవించి.. పరిష్కారం కోరి