
సర్వేయర్ల పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే గ్రామ పాలన అధికారులు స్క్రీనింగ్, లైసెన్స్‌డ్ సర్వేయర్ల అర్హత పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి శుక్రవారం పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్కాపూర్‌లోని జూనియర్ కళాశాలలో గ్రామ పాలన అధికారులు స్క్రీనింగ్, లైసెన్స్‌డ్ సర్వేయర్ల అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పాలన అధికారులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు రెండు సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులు, రూట్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండేలా చూడాలన్నారు. ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడపాలని, వైద్య ఆరోగ్యశాఖ శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు ఎంప్లాయి గుర్తింపు కార్డు, హాల్ టికెట్, ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, ఆర్టీసీ డీఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.