
చట్టాలపై అవగాహన అవసరం
జైనూర్(ఆసిఫాబాద్): చట్టాలపై మహిళలు, విద్యార్థినులకు అవగాహన అవసరమని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో శుక్రవారం మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైం, నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అపరిచితుల కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల మాయమాటలు విని మోసపోవద్దన్నారు. సోషల్ మీడియాను వినియోగించడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికావొద్దన్నారు. పోలీసుశాఖ, ఐకేపీ, ప్రజ్వల ఎన్‌జీవో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో మహిళలు, విద్యార్థినులు డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులకు భయపడకుండా కుటుంబ సభ్యులు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సీఐ రమేశ్, ఎస్సై రవికుమార్, ఐసీడీఎస్ సీడీపీవో ఇందిర, ప్రజ్వల ఎన్‌జీవో ప్రతి నిధులు సిరాజ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.