
బంద్ సంపూర్ణం
● జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్ ● స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూత ● నిర్మానుష్యంగా మారిన బస్టాండ్లు, మార్కెట్లు ● మద్దతు పలికిన రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్/కాగజ్‌నగర్‌రూరల్: జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను మహారాష్ట్రలోని తడోబా– అంధారి టైగర్ రిజర్వ్‌తో కలిపే జిల్లాలోని కారిడార్ అటవీ ప్రాంతాన్ని ‘కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్’గా ప్రకటిస్తూ జారీ చేసిన 49 జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఉదయం నుంచి మూసివేశారు. బస్సులను అడ్డుకోవడంతో బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. ఏజెన్సీ మండలాలైన లింగాపూర్, కెరమెరితోపాటు వాంకిడి, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి మండలాల్లో ప్రజలు బంద్ పాటించారు. పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో జనసంచారం కనిపించలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఎలాంటి ఆందోళన వద్దు
టైగర్ కన్జర్వేషన్ పేరుతో తీసుకువచ్చిన జీవో 49 రద్దు అవుతుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జీవో 49 రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు. జీవో విడుదల అనంతరం జిల్లాలో పరిస్థితులను వివరించారు. కేంద్రం ఒత్తిడితో జారీ చేసిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జీవో రూపొందిందని, బీజేపీ ఒత్తిడితోనే జారీ అయిందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
కాగజ్‌నగర్‌లో నిరసనలు
కాగజ్‌నగర్ పట్టణంలో వ్యాపారులు, ప్రజలు స్వ చ్ఛందంగా బంద్ పాటించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతోపాటు నాయకులు రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవో 49ను అమలు చేస్తే జిల్లా అభివృద్ధి పూర్తిగా కుంటుపడి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఐద్వా మహిళా సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడుతూ జిల్లాలోని 339 గ్రామాల ఆదివాసీ ప్రజలను వారి భూములకు దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పన్నాయని ఆరో పించారు. అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహించరానిదన్నారు. ఆర్టీసీ బస్సులు ఆసిఫాబాద్ డిపో నుంచి కాగజ్‌నగర్ బస్టాండ్‌కు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పలేదు. కాగజ్‌నగర్ బస్టాండ్ వెలవెలబోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయ, అసెంబ్లీ కన్వీనర్, వీరభద్రచారి, నాయకులు సిందం శ్రీనివాస్, శంకర్, తిరుపతి, శ్రీనివాస్, సీసీఎం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిర్మానుష్యంగా కాగజ్‌నగర్‌లోని మార్కెట్ ఏరియా
జీవో 49 నిలుపుదల
టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించారు. ఆదివాసీల ఆందోళనల దృష్ట్యా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇచ్చిన నివేదిక మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీవోను నిలిపివేస్తున్నట్లు మెమో జారీ చేశారు. కాగా, జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకుడు మడావి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బస్సులు అడ్డగింత
తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్, రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షు డు మడావి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెందోర్ సుధాకర్, గోండ్వానా ఫౌండేషన్ చైర్మన్ సిడాం తిరుపతి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్‌తో పాటు పలు వురు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్నారు. పోలీసులకు ఆదివాసీ నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఉద యం బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పోలీసులు జో క్యం చేసుకుని బస్సు ల రాకపోకలు కొనసాగించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజ య్‌కుమార్ మాట్లాడుతూ టైగర్ కన్జర్వేషన్ పేరి ట ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే రద్దు చే యాలని డిమాండ్ చేశారు. పెసా చట్టం, 1/70 చ ట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో ఉందని స్పష్టం చేశారు. 339 గ్రామాలను తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆదివాసీలతోపాటు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బంద్ సంపూర్ణం