
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
సారంగపూర్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు జౌళి గ్రామానికి చెందిన పోటెండ్ల భీమేశ్ (34) శుక్రవారం సాయంత్రం స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని బంధువులు శనివారం ఉదయం ప్రాజెక్టు పరిసరాల్లో గాలించగా మృతదేహం లభ్యమైంది. కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతిచెంది ఉంటాడని బావించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి గతంలో వివాహమైనా విడాకులు కావడంతో ఒంటరిగానే ఉంటున్నాడని బంధువులు తెలిపారు.