యువ వికాసంపై ప్రచారం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీవ్ యువవికాసం పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి బుధవారం మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత ఈ నెల 14లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకోవాలన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని తహసీల్దార్లను ఆదేశించారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని స్పష్టం చేశారు. యూనిట్ల వివరాలు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సజీవన్, లీడ్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్‌జోషి తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయాలి
ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సీసీరోడ్లు, డ్రె యినేజీల నిర్మాణాలు వందశాతం పూర్తి చేసేందు కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ, ఏఈఈలతో పనుల పురోగతి, ఎంబీ రికార్డులపై సమీక్షించారు. పూర్తయిన పనుల ఫొటోలు, వివరాలతో ఎంబీ రికార్డులు సిద్ధం చేసి ఈ నెల 5లోగా సమర్పించాలన్నారు. డీఆర్‌డీవో దత్తారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్ పాల్గొన్నారు.


