● విద్యుత్ అంతరాయంతో రైతుల తంటాలు ● జనరేటర్ల వినియోగంతో అదనపు భారం ● ఇంకొన్ని చోట్ల సాగునీరు అందక అవస్థ
తిరుమలాయపాలెం: జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బీరోలు, బంధంపల్లి, పిండిప్రోలు, ఎదుళ్లచెరువు, బాలాజీనగర్తండా తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బావుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా విద్యుత్ సరఫరా సక్రమంగా లేక వరి పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నామ ని.. ఫలితంగా కళ్ల ముందే పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉద యం 5నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నా... పలుమార్లు అంతరాయం ఏర్పడుతూ వరి మడులు పూర్తిగా తడవడం లేదు. మరో ఇరవై రోజులు సక్రమంగా నీరు అందితేనే పంట చేతికొచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఈక్రమాన బీరోలుకు చెందిన రైతు మిర్యాల విక్రంరెడ్డి 21 ఎకరాల్లో వరిసాగు చేయగా, బావి నిండా నీరు ఉన్నా విద్యుత్ అంతరా యాలను అధిగమించేందుకు భారమైనా ట్రాక్టర్ జనరేటర్ ఏర్పాటుచేయించాడు. పగటి పూట విద్యుత్తో మూడు మోటార్లు ఆన్ చేసి నీటి తడులు ఇస్తుండగా.. మిగతా సమయంలో ట్రాక్టర్కి అమర్చే జనరేటర్ సాయంతో నీటితడి అందిస్తూ పంటను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.


