● జిల్లాలోని ఐదు పీఎస్‌ల పరిశీలన ● ఒకటి, రెండు ఎంపికయ్యే అవకాశం
ఖమ్మంక్రైం: కేసుల నమోదులో పారదర్శకత, పరిష్కారంలో సాంకేతికత వినియోగం, ప్రజలకు మెరుగైన, స్నేహపూర్వక సేవలు అందించడంలో ముందు వరుసలో నిలిచే పోలీసుస్టేషన్లకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ద్వారా గుర్తింపు ఇస్తారు. ఈమేరకు జిల్లాలోని ఐదు పోలీసుస్టేషన్లను కొద్దిరోజుల క్రితం క్యూసీఐ బృందాలు పరిశీలించాయి. బృందాలు పరిశీలించిన అంశాల్లో సంతృప్తికరమైన పరిస్థితి ఉందని గుర్తించినట్లు తెలుస్తుండగా, త్వరలోనే జాబితాలో చోటు దక్కే అవకాశముంది. ఇదే జరిగితే పీఎస్‌ల అభివృద్ధి, నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఏమిటీ క్యూసీఐ!
దేశంలో వివిధ రకాల సేవలు, ఉత్పత్తులు, ప్రక్రియల నాణ్యతను పర్యవేక్షిస్తూ మెరుగుపరిచే అత్యున్నత స్వయం ప్రతిపత్తి సంస్థే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దేశంలోని పోలీస్స్టేషన్ల పనితీరుపై పరిశీలన జరిపి సిబ్బంది పనితీరు, ఫిర్యాదుదారులకు అందుతున్న స్నేహ పూర్వక సేవలు, స్టేషన్ పరిసరాల శుభ్రత తదితర అంశాలను పరిశీలిస్తారు. ఉత్తమ మౌలిక వసతులు, స్టేషన్లో సందర్శకుల కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్, మహిళల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్, హెల్ప్‌డెస్క్ వంటి ఆధునిక వసతులు ఉన్నాయా, లేదా అని తీస్తారు. గతంలో ఇదే తరహాలో సేవలు అమల్లో ఉన్న హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు క్వాలిటీ ఆఫ్ ఇండియా దేశంలోనే రెండో ఉత్తమ పోలీసుస్టేషన్‌గా గుర్తింపు ప్రకటించింది.
ఐదు స్టేషన్లలో పరిశీలన
గతనెల 28, 29వ తేదీల్లో క్యూసీఐ బృందం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వన్, టూ, త్రీ టౌన్ స్టేషన్లతో పాటు ఖమ్మం అర్బన్(హవేలీ) పోలీసుస్టేషన్లలో పరిశీలించింది. అలాగే, వేంసూరు పోలీసుస్టేషన్‌కు పరిశీలించి సేవ నాణ్యతపై ఆరా తీసింది. జిల్లా నుంచి ఐదు పీఎస్‌లను పరిశీలించిన నేపథ్యాన.... ఖమ్మం అర్బన్, టూటౌన్ పోలీసుస్టేషన్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసే పీఎస్‌ల జాబితాలో ఈ రెండు లేదా ఒక స్టేషన్‌కు చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. తద్వారా అభివృద్ధి, నిర్వహణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిధులు విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.


