● కేఎంసీ, నాలుగు మున్సిపాలిటీలకు కేటాయింపు ● స్వచ్ఛ భారత్ మిషన్–2.0 కింద రూ.1.31 కోట్లు ● కొత్తగూడెంతో పాటు ఇంకొన్నింటికి దక్కని స్థానం
ఖమ్మం మయూరిసెంటర్: పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్)–2.0 కింద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్తో పాటు కల్లూరు, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్, టాయిలెట్ల నిర్వహణ, బయోమైనింగ్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది.
రూ.1.31 కోట్ల నిధులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కల్లూరు, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.1,31,26,000 కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖజానా అడుగంటడంతో అల్లాడిపోతున్న ప్రస్తుత తరుణాన ప్రభుత్వం మంజూరు చేసిన కొద్దిపాటి నిధులు ఊరట ఇవ్వనున్నాయి. కాగా, నిబంధనల ప్రకారం సంబంధిత పనులకు వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొనగా.. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఏదులాపురం, మధిర, వైరా, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు మాత్రం నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం.
●ఖమ్మం కార్పొరేషన్లో బయో మైనింగ్ పనుల కోసం రూ.25 లక్షలు మంజూరయ్యాయి.
●సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.48.50 లక్షలు మంజూరు కాగా.. బయోమైనింగ్ కోసం రూ.28 లక్షలు, ఫ్రెష్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం రూ.20.50 లక్షలు కేటాయించారు.
●కల్లూరులో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ కోసం రూ.30 లక్షలు కేటాయించారు.
●మణుగూరులో మరుగుదొడ్ల నిర్మాణం,
నిర్వహణకు రూ.12.76 లక్షలు మంజూరయ్యాయి.
●ఇల్లెందులో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ కోసం రూ.15 లక్షలు విడుదలయ్యాయి.


