పత్తి రైతులకు ఊరట
● సీసీఐ కొనుగోళ్లు 27 వరకు పొడగింపు
ఖమ్మంవ్యవసాయం: గడిచిన సీజన్‌లో పత్తి సాగు చేసిన రైతులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు మద్దతు ధర దక్కేలా సీసీఐ ఆధ్వర్యాన చేపట్టిన కొనుగోళ్లు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ముగిశాయి. అయితే, తీతలో ఆలస్యం ఇతర కారణాలతో పలువురు రైతుల దగ్గర ఇంకా పత్తి ఉండిపోయింది. ఇప్పుడు సీసీఐ కొనుగోళ్లు నిలిపివేస్తే వ్యాపారులు ధర తగ్గిస్తారని రైతులు ఆందోళన చెందుతుండడంతో కొనుగోళ్లను ఈనెల 27 వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీతో కొనుగోళ్లు ముగుస్తాయని ముందుగా ప్రకటించినా, మరో వారం అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. జిల్లాలో నిర్దేశించిన జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, రైతులు కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని విక్రయించుకోవాలని సూచించారు.
జమలాపురంలో
ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించడమే కాక పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు సమక్షాన పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ల ఫీజు వసూళ్లపై సమీక్ష
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ, పన్నుల వసూళ్లపై శనివారం జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీం సమీక్షించారు. ఖమ్మంలో మార్కెట్ల కార్యదర్శులతో సమావేశమైన ఆయన ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్నందున ఫీజు వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాక వచ్చే ఏడాది ఫీజు లక్ష్యాలపై చర్చించడంతో పాటు మార్కెట్ల వారీగా బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని తెలిపారు. ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, నేలకొండపల్లి, ఏన్కూరు, మత్కేపల్లి మార్కెట్ల కార్యదర్శులు పాల్గొన్నారు.
పత్తి రైతులకు ఊరట


