ఎరువుల కొరత వస్తుందని.. రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఎరువుల కొరత వస్తుందని.. రైతుల ఆందోళన

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

● పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో కొరత ఏర్పడుతుందని ప్రచారం ● వచ్చే వానాకాలానికి ఇప్పుడే ఎరువులు కొంటున్న కొందరు రైతులు ● గతేడాది యూరియా వెతల అనుభవంతో ముందస్తుగా అప్రమత్తత

● పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో కొరత ఏర్పడుతుందని ప్రచారం ● వచ్చే వానాకాలానికి ఇప్పుడే ఎరువులు కొంటున్న కొందరు రైతులు ● గతేడాది యూరియా వెతల అనుభవంతో ముందస్తుగా అప్రమత్తత

బూర్గంపాడు: పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధర రైతులకు దడ పుట్టిస్తోంది. ఏడాది కాలంగా యూరియా కొరత కూడా వేధిస్తోంది. వీటికి తోడు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎరువుల కొరత ఏర్పడుతుందని, ధర రెట్టింపు అవుతుందనే ప్రచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎరువుల తయారీకి అవసరమయ్యే ముడిసరుకు రవాణా కూడా ఆగిపోయింది. కొన్నిరకాల ఎరువుల దిగుమతులు కూడా నిలిచిపోయాయి. దీంతో పలువురు రైతులు వచ్చే వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల కోసం ఇప్పటి నుంచే వెతుకులాట ప్రారంభించారు.

మూడు నెలల ముందే కొంటున్న రైతులు

వానాకాలం సీజన్‌ ఆరంభానికి ఇంకా మూడు నెలలు సమయముంది. యాసంగి పంటలు చేతికి కూడా రాలేదు. ఎరువుల కొరత వస్తుందనే ప్రచా రంతో రైతులు అప్రమత్తమవుతున్నారు. అప్పులు చేసి మరీ ఎరువులు కొనుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం పంటలకు అవసరమయ్యే ఎరువుల్లో కనీసం సగభాగమైన ముందుగా సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కాంప్లెక్స్‌ ఎరువులను కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పటికే డీఏపీ, 20:20:13, పోటాష్‌ వంటి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. 14:35:14, 28:28:0, 10:26:26 వంటి ఎరువుల ధరలు బస్తా రూ. 2,150కు చేరింది. ఇంకా బస్తాకు రూ.500 నుంచి రూ.800 వరకు పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. దీంతో రైతులు ముందస్తుగా ఎరువులు కొనుగోలు చేస్తుండగా, ఇదే అదునుగా కొందరు వ్యాపారులు రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఎరువులను బ్లాక్‌లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

గత వానాకాలం సీజన్‌ అంతా ఇక్కట్లే

గతేడాది వానాకాలం సీజన్‌లో యూరియా దొరకక రైతులు రోజుల తరబడి ఎరువుల దుకాణాల వద్ద, పీఏసీఎస్‌ గోదాంల వద్ద బారులుదీరారు. రూ 267 ఉన్న యూరియా బస్తాను రూ.500 చెల్లించి బ్లాక్‌లో కొనుకున్నారు. కొందరు రైతులు యూరియా దొరకక కాంప్లెక్స్‌ ఎరువులనే పంటలకు వేసుకున్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో యూరియా విక్రయాలకు ఫర్టిలైజర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్‌లో బుక్‌ చేసుకున్నా ప్రైవేటు డీలర్లు యూరియాను ఎక్కువ ధరలకు విక్రయించారు. నెలరోజులుగా యూరియా సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు. కొందరు రైతులు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో ఫర్టిలైజర్‌ యాప్‌లు లేకపోవటంతో అక్కడి ప్రైవేటు డీలర్లు ఎక్కువ ధరలకు జిల్లా రైతులకు విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే సీజన్‌లో ఇంకేలాంటి పరిస్థితి ఏర్పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement