మరిన్ని యూనిట్లు ఇవ్వాలని లేఖ
● ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల పంపిణీ ● ఉన్నత విద్య చదువుతున్న వారికి ప్రభుత్వం చేయూత ● జిల్లాలో అర్హుల ఎంపిక, యూనిట్ల పంపిణీ ● కొత్త ఆర్థిక సంవత్సరం లక్ష్యాలపై కసరత్తు
ఖమ్మంమయూరిసెంటర్: వైకల్యం చదువుకు అడ్డంకి కావొద్దనే భావనతో ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సాంకేతిక సాయం చేస్తోంది. దృష్టి, వినికిడి లోపం, లొకోమోటర్ వైకల్యం కలిగి ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. లోపాలు కలిగిన వారు డిజిటల్ విధానంలో చదవడం ద్వారా సాధారణ విద్యార్థులతో పోటీ పడే అవకాశముంటుందని చెబుతున్నారు. విద్యావసరాలకు అనుగుణంగా వీటిని అర్హులైన వారికి అందజేయనున్నారు. ఇప్పటికే 2025–26 ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించి అర్హుల ఎంపిక చేయగా, పంపిణీ సైతం చివరి దశకు చేరింది.
మూడు విభాగాల్లో ఉపకరణాలు
దివ్యాంగులకు ఇచ్చే సహాయ ఉపకరణాలు మూడు విభాగాలుగా వర్గీకరించారు. ప్రొఫెషనల్ కోర్సుల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను ఇందులో చేర్చారు. పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు హై–ఎండ్ ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్‌లు, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు.
పంపిణీ చివరి దశలో..
ఖమ్మం జిల్లాలో దివ్యాంగుల నుంచి సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తులు అందగా, అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. హై–ఎండ్ ల్యాప్‌టాప్‌లు 15 యూనిట్లను జిల్లాకు లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే, ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సులు చదువుతున్న దృష్టి, వినికిడి లోపం ఉన్న 25 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని లక్ష్యంగా నిర్ణయించారు. సాధారణ డిగ్రీ కోర్సులు చదువుతూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యే దివ్యాంగ విద్యార్థులు 32 మందిని ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఇప్పటికే లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయగా, త్వరలోనే కొత్త సంవత్సరంలక్ష్యాలు ఖరారు కానున్నాయి..
ఇతర ఉపకరణాలు కూడా..
చదువుకునే దివ్యాంగులే కాక ఇతర పనులు చేసుకునే వారు, ఇంటి వద్ద ఉండే వారికి కూడా అవసరమైన సహాయ ఉపకరణాలను అందించేందుకు జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రెట్రోఫిట్టెడ్ మోటార్ వాహనాలు 100, బ్యాటరీ వీల్ చైర్లు 30, 5జీ స్మార్ట్ ఫోన్లు ఐదు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 40, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వాహనాలు రెండు, పది హైబ్రిడ్ వీల్‌చైర్ అటాచ్‌మెంట్ ఉపకరణాలు అందించేలా జిల్లాకు లక్ష్యాన్ని కేటాయించారు. ఈ యూనిట్ల పంపిణీ కూడా ఇటీవలే పూర్తయింది.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందిస్తోంది. దివ్యాంగ విద్యార్థులతో పాటు ఇతరులకు 2025–26 సంవత్సరానికి 259 యూనిట్లు మంజూరు కాగా, అర్హులను ఎంపిక చేసి పంపిణీ చేశాం. ప్రభుత్వం కేటాయించే ఈ ఉపకరణాలతో సాధారణ వ్యక్తులతో పోటీపడే అవకాశం దక్కుతుంది. జిల్లాలో అర్హులు చాలామంది ఉన్నందున 2026–27 సంవత్సరానికి ఎక్కువ యూనిట్లు మంజూరు చేయాలని
ఉన్నతాధికారులకు లేఖ రాశాం.
– వేల్పుల విజేత, జిల్లా సంక్షేమ అధికారి


