తల్లాడ: మండలంలోని కుర్నవల్లి వేంకటాచలపతి దేవస్థానం ఆధ్వర్యాన నిర్వహించిన నాలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్కై జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్స్ గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఈమేరకు విజేత జట్టుకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతుల మీదుగా రూ.80116 నగదు బహుమతి అందజేశారు. అలాగే, రంగారెడ్డి, విలపురం(తమిళనాడు), హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కుర్నవల్లి, బాపట్ల, మిషన్ ఏపీ జట్లు రెండు నుంచి తొమ్మిదో స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్, కల్లూరు మార్కెట్ చైర్‌పర్సన్లు కాపా చంద్రకళ, బాగం నీరజ, కాంగ్రెస్ జిల్లా, తల్లాడ మండల అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, కాపా సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
7న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ జట్లను ఈనెల 7వ తేదీన ఎంపిక చేయనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–20, సీనియర్ పురుషులు, మహిళల విభాగాల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నాయని, ఆసక్తి ఉన్నవారు వయసు ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు.
నిర్మాణ కార్మికులకు బీఓసీడబ్ల్యూ అండ
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలోని బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు(బీఓసీడబ్ల్యూ) కార్మికుల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతోందని ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. మేసీ్త్ర పని, బార్ బెండింగ్, ఎలక్ట్రికల్, వెల్డింగ్‌లో అనుభవం కలిగిన బీఓసీడబ్ల్యూ నమోదిత కార్మికులకు రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్(ఆర్‌పీఎల్) పద్ధతిలో అధికారిక నైపుణ్య సర్టిఫికెట్లు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సర్టిఫికెట్ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. అలాగే కార్మికుల పిల్లలు లేదా వారిపై ఆధారపడిన 18 – 30 ఏళ్ల వయసు గల వారికి భాషా, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలకు సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈమేరకు భవన నిర్మాణ కార్మికులు, వారి పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
9న సీపీఎం జిల్లా ప్లీనం
ఖమ్మంమామిళ్లగూడెం: సీపీఎం జిల్లా ప్లీనం ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని వెల్లడించారు. అలాగే, 4వ తేదీన ఖమ్మం బోస్‌బొమ్మసెంటర్‌లో సీపీఎం సీనియర్ నాయకుడు యర్రా శ్రీకాంత్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
భూదాన్ నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి
ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులందరికీ అక్కడే స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జతిన్‌కుమార్, విజయేందర్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏళ్లుగా అక్కడ నివాసముంటున్న పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెలుగుమట్ల కాలనీలో మౌలిక వసతులు కల్పించకున్నా ఇబ్బందుల నడుమ జీవనం సాగించారని, అయినా కూల్చివేయడమే కాక డబ్బు వసూలు చేశారంటూ పలువురిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో కొందరికే అక్కడ ఇళ్లు మంజూరు చేసి, మిగతా అర్హులను విస్మరించారని ఆరోపించారు. ఇకనైనా అర్హులైన వారందరికీ అక్కడే స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని జతిన్‌కుమార్, విజయేందర్ డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో ఓపీడీఆర్ నాయకులు డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


