
మాకెవరూ అడ్డు లేరు..
కరిగిపోతున్న గుట్టలు
తాత్కాలిక అనుమతుల మాటున దందా ప్రభుత్వ పనుల పేరుతో ప్రైవేట్ వెంచర్లకు తరలింపు ఫిర్యాదు అందితేనే అధికారుల తనిఖీలు.. ఆపై జరిమానాతో సరి
తనిఖీలు.. జరిమానాలు
●
బోనకల్ మండలం లక్ష్మీపురంలో పట్టా భూమి నుంచి మట్టి తరలిస్తున్న దృశ్యం
అవసరాలే అదనుగా..
జిల్లాలోని నగరాలు, మండల కేంద్రాల్లో నిర్మాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. వీటికి తోడు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి, ఇసుక అవసరమవుతోంది. ఇదే అదనుగా కొందరు దందాకు తెరలేపారు. వాగులు తదితర వనరుల నుంచి ఇసుక, గుట్టలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి తవ్వి రవాణా చేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకుంటుండగా గ్రామాల్లో లోడ్లతో వాహనాలు కళ్లముందే తిరుగుతున్నా అధికారులు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అనుమతుల పేరిట..
పలు ప్రాంతాల్లో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. మట్టి తవ్వకానికి ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు ప్రాంతాల్లోనే పర్మిట్లు ఉన్నాయి. అలాగే, రాష్ట్ర, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, జలవనరుల శాఖ పరిధిలో పనుల కోసం 61 ప్రాంతాల్లో తాత్కాలిక అనుమతులు జారీ చేశారు. ఈ ప్రాంతాల నుంచే మట్టి తరలించాల్సి ఉండగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇసుక అధికారిక క్వారీలు లేకున్నా తహసీల్దార్ల నుంచి కూపన్లు తీసుకుని పరిమితికి మించి రవాణా చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎప్పుడైనా ఫిర్యాదు అందితేనే అధికారులు హడావుడి చేసి ఆతర్వాత అటువైపుగా చూడకపోవడం అక్రమార్కులకు కలిసొస్తోంది.
చదును చేస్తామంటూ...
బోనకల్ మండలం లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో 60ఎకరాల పట్టా భూమిలో గుట్టలు ఉన్నాయి. గోవిందాపురం రెవెన్యూలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రెండు చోట్ల నుంచి ఎర్రమట్టి తోలకానికి అనుమతి లేకపోగా.. భూమి చదును చేస్తామంటూ దందాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అవసరాల పేరుతో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ప్రైవేట్ అవసరాలకు మట్టిని తరలిస్తున్నారు. గోవిందాపురం(ఎల్)లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతుండగా, ఆ పేరుతోనూ మట్టి తరలింపు కొనసాగుతోంది. స్థానిక అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేక స్థానికులు ఇటీవల కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో గత రెండు, మూడు రోజులుగా తనిఖీ చేస్తుండగా టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం డిపోలు
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతీ నియోజకవర్గంలో ఇసుక డిపోలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. ఖమ్మం, కామేపల్లి, సత్తుపల్లి, కూసుమంచి, మధిర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా, ఖమ్మం, కూసుమంచి, మధిరలో ప్రారంభమయ్యాయి. త్వరలోనే కామేపల్లి, సత్తుపల్లిలో కూడా డిపోల ద్వారా ఇసుక పంపిణీ మొదలవుతుందని హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్ తెలిపారు. అయినా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు.
జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. దందాను అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఫిర్యాదు అందితేనే కదులుతాం అన్నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక, మట్టిని ప్రభుత్వ అవసరాల పేరిట, తాత్కాలిక అనుమతుల మాటున తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు రెండు క్వారీలకే అనుమతి ఉండగా, చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇక ఇసుకను తాత్కాలిక అనుమతుల పేరుతో లెక్కకు మించి రవాణా చేస్తుండడం గమనార్హం. – సాక్షిప్రతినిధి, ఖమ్మం/ ఖమ్మంఅర్బన్
పలు మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలతో 30 – 40 అడుగుల ఎత్తుతో ఉండే గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. అక్రమ తవ్వకాలపై స్థానికులు పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎర్రుపాలెం మండలంలో తవ్వకాలపై ఫిర్యాదు చేశాక అధికారుల్లో కదలిక వచ్చింది. ఈక్రమంలోనే బోనకల్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ తదితర మండలాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి రవాణా
ఇసుక, మట్టి తరలింపుపై నిఘా వేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,288 వాహనాలు తనిఖీ చేశాం. ఇందులో 211 వాహనాల్లో ఇసుక, 109 వాహనాల్లో ఇతరత్రా తరలిస్తున్నట్లు గుర్తించి రూ.43.69లక్షల జరిమానా విధించాం. గత ఐదు నెలల కాలంలో 340 కేసులు నమోదు చేసి రూ.1.71,73,000 పెనాల్టీ వసూలు చేశాం.
– సాయినాథ్, ఏడీ, మైనింగ్‌శాఖ

మాకెవరూ అడ్డు లేరు..