
ఔను.. వారు విజేతలు!
రెండు రాష్ట్రాల్లోనూ టీచర్ ఉద్యోగాలకు ఎంపిక ఇప్పటికే తెలంగాణలో విధులు తాజాగా ఏపీలోనూ ఉపాధ్యాయ ఉద్యోగాలు
కష్టపడితే విజయం బానిసగా మారుతుందని నిరూపించారు కొందరు యువతీ, యువకులు. నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ముగ్గురు ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఏపీలో నోటిఫికేషన్ రాగానే సిద్ధమై అక్కడ కూడా ఉద్యోగాలు సాధించడం విశేషం. – మధిర
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించాలన్న కలను నిజం చేసుకునేందుకు తెలంగాణలో ఐదు శాతంగా ఉన్న ఓపెన్ కేటగిరీలో పలువురు ఏపీ వాసులు పోటీపడ్డారు. ఇందులో నాయుడు భవాని, రుద్రపంక్తి సంతోష్ కుమార్, మజ్జిగ త్రినేత్ర ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు గత ఏడాది అక్టోబర్ 10న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకొని మధిర మండలంలో ఎస్‌జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందక... సొంత రాష్ట్రమైన ఏపీలోనూ ఉద్యోగాలు సాధించాలనే తపనతో సిద్ధమై ఇటీవల పరీక్ష రాయగా ఉద్యోగాలు దక్కాయి. దీంతో వీరు ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ఈనెల 19న వారు నియామక పత్రాలు అందుకోనున్నారు. కాగా, మధిర మండలంలో పనిచేసిన 11 నెలల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల, సహచర ఉపాధ్యాయుల మన్ననలు పొందారు.
ఏపీలోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగాయలంక గ్రామం భవానీ స్వగ్రామం. ఆమె తండ్రి దుర్గాప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి వీరలక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. తెలంగాణ టెట్‌లో 150కి 135, డీఎస్సీలో వందకు 81 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఏపీ టెట్‌లో 150కి 143.58, సాధించగా డీఎస్సీలో వందకు 85.19 మార్కులతో ఉద్యోగానికి ఎంపికై ంది. ఈసందర్భంగా భవానీ మాట్లాడుతూ తన తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని తెలిపారు. తన చిన్నతనంలో మూస పద్ధతిలో బోధనతో ఇబ్బంది పడగా, సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సిద్ధమయ్యానని చెప్పారు. ఇదే సమయాన తాను బోధించే పాఠశాలలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు.