
20న జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేలా టేకులపల్లి మోడల్ కేరీర్ సెంటర్‌లో ఈనెల 20న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్ లాబోరేటరీస్‌లో ప్రొడక్షన్ ట్రెయినీ ఉద్యోగలకు ఎంపిక ఉంటుందని వెల్లడించారు. ఎంపీసీ, బైపీసీతో ఇంటర్ పూర్తిచేసిన వారు, ఎంఎల్‌టీ, బ్రిడ్జి కోర్సు, ఫార్మా టెక్ 2024–2025లో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 18 – 25 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 91546 79103 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రేషన్ దుకాణం సీజ్
కొణిజర్ల: కొణిజర్ల మండలం సాలెబంజరలోని రేషన్ దుకాణంలో రికార్డులతో పోలిస్తే బియ్యం తక్కువగా ఉండటంతో సీజ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్ తెలిపారు. రేషన్‌షాప్‌లను గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులు, స్టాక్‌ను పరిశీలించారు. షాప్‌నకు 86.76 క్వింటాళ్ల సన్నబియ్యం కేటాయిస్తే 7.31 క్వింటాళ్లే పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉందని, మిగతా 79.45 క్వింటాళ్లకు గాను క్వింటా మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈమేరకు డీలర్ బాదావత్ బిచ్యాపై 6(ఏ) కేసు నమోదు చేసినట్లు డీసీఎస్‌ఓ వెల్లడించారు. డీలర్లు బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రతీనెల బియ్యం సరిగా ఇవ్వకపోవడంతో పక్క గ్రామాలకు వెళ్తున్నట్లు గ్రామస్తులు ఆయనకు ఫిర్యాదు చేశారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ వీరయ్య పాల్గొన్నారు.
స్వయం ఉపాధిపై
అవగాహన
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ఆధ్వర్యాన ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో గురువారం సీ్త్ర సంఘాల(ఎస్‌ఎస్‌జీ) సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న రుణాలు, సబ్సిడీతో మహిళల స్వయం ఉపాధి రంగాల్లో ఎదగాలని సూచించారు. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం డీసీసీబీ అధికారులు రుణాల మంజూరు, సబ్సిడీలు, చెల్లింపు వివరాలను వివరించారు. బ్యాంకు సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, డైరెక్టర్ పునుకొల్లు రాంబ్రహ్మం పాల్గొన్నారు.
చిన్నారుల గాంధీగిరి!
తల్లాడ: పాఠశాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్ మియాకు గులాబీపూలు అందించారు. పాఠశాలలో భగీరథ పైపులైన్ లేక తాగునీరు అందడం లేదని, పైపులైన్ నిర్మాణానికి తవ్వి వదిలేయడంతో రోడ్డు పాడైందని పేర్కొన్న వారు పాఠశాలకు ఇరువైపలా పిచ్చిమొక్కలు తీయించాలని కోరారు. దాసరి వీరభద్రరావు యూత్ క్లబ్ నిర్వాహకులు డి.అజయ్‌కుమార్, జి.కృష్ణారావు సంఘీభావం తెలపగా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కార్యదర్శి తెలిపారు.
బదిలీ స్థానాల్లో
చేరుతున్న పీఏసీఎస్‌ల కార్యదర్శులు
ఖమ్మంవ్యవసాయం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) కార్యదర్శుల బదిలీల వ్యవహారం తిరిగి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఆగస్టు చివరి వారంలో కేటగిరీల వారీగా బదిలీలు చేపట్టగా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో వారిని పాత స్థానాల్లోనే కొనసాగించాలని స్టే ఇచ్చింది. జిల్లాలో 76 పీఏసీఎస్‌లకు 69 సంఘాల కార్యదర్శులను బదిలీ చేయగా, వీరిలో 35 మంది కోర్టును ఆశ్రయించారు. మిగిలిన వారు బదిలీలను సమ్మతించగా.. జిల్లా కమిటీ అనుమతితో 16 మంది నూతన స్థానాల్లో చేరారు. కోర్టుకు వెళ్లిన 35 మందిలో 25మంది కేసు విరమణకు పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే వీరు సైతం బదిలీ స్థానాల్లో చేరనుండగా, కార్యదర్శుల వినతితో కొందరి స్థానాలు మార్చే అవకాశముందని సమాచారం.

20న జాబ్ మేళా