
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ప్రతీ సోమవారం లబ్ధిదారుల్లో ఖాతాల్లోకి నగదు
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని మేకలతండా, మేడిదపల్లి, తిమ్మక్కపేట, సుబ్లేడు గ్రామాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన గురువారం రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల సమయాన ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే, తాము మాత్రం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తూ ప్రతీ సోమవారం నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. కాగా, సుబ్లేడులో ఇటీవల మృతి చెందిన యూటీఎఫ్ ఉమ్మడి ఏపీ కోశాధికారి, సీపీఎం నాయకుడు జియావుద్దీన్ సంస్మరణ సభలో మంత్రి పొంగులేటి పాల్గొని నివాళులర్పించారు.
పేదల అభివృద్దికి చిత్తశుద్ధితో కృషి
కూసుమంచి: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసమంచి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇది కాక అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో ఎన్నికల నాటి హామీలు నెరవేరుస్తున్నామని వెల్లడించారు. కాగా, రెవెన్యూ శాఖలో జీపీఓలుగా నియమితులైన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవద్దని, అలా జరిగితే ఉద్యోగం పోతుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కొత్తగా నియమితులైన జీపీఓలు మంత్రిని కలవగా ఆయన మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా తాము తీరుస్తామని తెలిపారు. కానీ తప్పు చేసి రెవెన్యూ శాఖకు మచ్చ తీసుకురావొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమాల్లో ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఎస్‌ఈలు యాకోబు, జి.వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, డీఎల్‌పీఓ రాంబాబు, తహసీల్దార్లు విల్సన్, రవికుమార్, ఎంపీడీఓలు సిలార్ సాహెబ్, రాంచందర్‌రావు, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, బోడ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.