
మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు మేలు
ఖమ్మంలీగల్: మధ్యవర్తిత్వం వల్ల అనేక లాభాలు ఉన్నందున కక్షిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలో మధ్యవర్తిత్వంతో లాభాలపై అవగాహన కల్పించేలా ఏర్పాటుచేసిన పోస్టర్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మధ్యవర్తిత్వంతో కేసు రాజీ పడకుంటే మళ్లీ కోర్టుకు వెళ్లవచ్చని తెలిపారు. ఎలాంటి ఖర్చు ఉండకపోగా, చర్చలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. నాలుగు దశల్లో మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వాణిజ్య వివాదాలు, కుటుంబ కలహాలు, చెక్‌బౌన్స్, ప్రమాద కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉన్నందున న్నాయయసేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా జడ్జి సూచించారు.
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
తల్లాడ: రైతులు పంటల సాగు సమయాన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటూనే అధిక దిగుబడులు సాధించొచ్చని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంతకుమార్ అన్నారు. తల్లాడ మండలం నూతనకల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పంపిణీ చేసిన డబ్ల్యూజీఎల్ 44, సిద్ధి విత్తనాలతో సాగు చేసిన వరి క్షేత్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అధిక దిగుబడి కోసం విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకుంటే మేలైన యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందొచ్చని చెప్పారు. అలాగే, వరిలో ఆశిస్తున్న బ్యాక్టీరీయా, ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 40 గ్రాములను పిచికారీ చేయడమే కాక తాత్కాలికంగా నత్రజని సంబంధిత ఎరువులు ఆపాలని సూచించారు. శాస్త్రవేత్తలు కె.రవికుమార్, డాక్టర్ శిరీష, ఏఓ ఎండీ.తాజుద్దీన్, ఏఈఓ త్రివేణి, రైతులు పాల్గొన్నారు.
‘రోజ్‌గార్ యోజన’ను వినియోగించుకోవాలి
ఖమంగాంధీచౌక్/ఖమ్మం సహకారనగర్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎంవీబీఆర్‌వై) పథకాన్ని అవసరమైన ఉద్యోగులు, యాజమాన్యాలు వినియోగించుకోవాలని వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వైడీ.శ్రీనివాస్ సూచించారు. ఉపాధి అవకాశాల పెంపు, యువతలో ఉపాధి సామర్థ్యాల అభివృద్ధి, సామాజిక భద్రతను మెరుగుపర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నెల వేతనం(గరిష్టంగా రూ. 15వేలు), రెండు విడతలుగా ఖాతాల్లో జమ చేస్తారని, తయారీ రంగం యజమానులకు ప్రతీ ఉద్యోగిపై నెలకు రూ.3వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. అయితే, యజమానులు ఎంప్లాయర్ పోర్టల్‌లోని పీఎంవీబీఆర్‌వై లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు వరంగల్‌లోని పీఎఫ్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
పాలేరులో సీసీ రోడ్లకు రూ.20కోట్లు

మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు మేలు