
పనికొచ్చే మొక్కలు పెంచండి..
● సత్తుపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి: అటవీశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొని పనికొచ్చే మొక్కలను పెంచాలని.. ఈ క్రమాన జామాయిల్ మొక్కల స్థానంలో వెదురు మొక్కలను నాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని తెలిపారు. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్‌పార్కులో చైన్‌లింక్ ఫెన్సింగ్, సఫారీ బ్యాటరీ వాహనాలు, టింబర్ డిపోలో మీటింగ్‌హాల్, పరేడ్ మైదానాన్ని గురువారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పట్టాలు ఇచ్చామని, పంటలు పండించుకుని ఫలసాయం పొందేందుకు ఆ భూములు వినియోగించుకోవాలని తెలిపారు. కాగా, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు అటవీశాఖ అటంకం కల్పించొద్దని సూచించిన ఆయన... పులిగుండాల ప్రాజెక్టుకు ఎన్నో అభ్యంతరాలు చెప్పినా, ఇప్పుడు అక్కడే ఎకో టూరిజం ప్రాజెక్టు సిద్ధమైందని చెప్పారు. రహదారులు, పంట కాల్వలకు అవసరమైన భూములను అటవీశాఖ నుంచి తీసుకుంటున్నప్పటికీ, ఎకరం కూడా అడవి ఆక్రమణ జరగకుండా చూసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఆయిల్‌పామ్ టన్ను రూ.20వేలు
ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలు టన్ను ధర రూ.19,400 ఉండగా, ఈ నెలాఖరుకల్లా రూ.20వేలు వచ్చేలా చూస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి వేశ్యాకాంత చెరువును గోదావరి జలాలతో నింపుతామని చెప్పారు. కాగా, మాజీ సీఎం జలగం వెంగళరావును చూసి రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన చేయలేని బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ, వేంసూరు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చానని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం తనకు రాజకీయ జన్మనిచ్చినందున, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు ఉన్నా అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ సునీల్‌దత్, అటవీశాఖ సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్, భాగం నీరజాదేవి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, తోట సుజలరాణి పాల్గొన్నారు.