
కోర్టును ఆశ్రయించిన సొసైటీల పాలకవర్గాలు
ఖమ్మంవ్యవసాయం: గతనెల 14న పీఏసీఎస్‌ల పదవీకాలం ముగియగా, కొన్నింటిని ఆరు నెలల పాటు పొడిగించిన ప్రభుత్వం ఇంకొన్ని పాలకవర్గాలను మాత్రం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు, నిర్వహణ లోపాలతో ఈ నిర్ణయం తీసుకుని పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈక్రమంలోనే జిల్లాలోని ఏదులాపురం, చేగొమ్మ, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పోచారం పాలకవర్గాలను రద్దు చేయగా, ఆయా పీఏసీఎస్‌ల చైర్మన్ల నాయకత్వాన హైకోర్టును ఆశ్రయించారు. మిగతా వారిలాగే తమను సైతం కొనసాగించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. జిల్లాతో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లోనూ రద్దయిన పాలకవర్గాల బాధ్యులు కోర్టును ఆశ్రయించగా, స్టే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా రామానుజం
ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్ డీసీపీ(అడ్మిన్‌గా) బి.రామానుజం నియమితులయ్యారు. ఈ స్థానాన గతంలో పనిచేసిన నరేష్‌కుమార్ బదిలీ అయ్యాక కొద్దినెలలుగా పోస్తు ఖాళీగా ఉంది. ఈనేపథ్యాన రామానుజంను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. 1991వ ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన ఆయన ఉమ్మడి జిల్లాలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ డీఎస్పీగా పనిచేస్తుండగా ఏఎస్పీగా పదోన్నతి కల్పించి ఖమ్మం బదిలీ చేశారు.
2,343 మెట్రిక్ టన్నుల యూరియా
● నేడు మరో 3వేల మెట్రిక్ టన్నులు..
ఖమ్మంవ్యవసాయం: జిల్లాకు యూరియా సరఫరా కొనసాగుతోంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు గురువారం 2,343 మెట్రిక్ టన్నుల ఎన్‌ఎఫ్‌ఎల్ కంపెనీ యూరియా చేరింది. ఇందులో 1,073 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, 470 మెట్రిక్ టన్నులు భద్రాద్రి జిల్లాకు, 600 మెట్రిక్ టన్నులను మహబూబాబాద్ జిల్లాకు చేరవేశారు. మిగిలిన 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశారు. ఇక శుక్రవారం మరో 3వేల మెట్రిక్ టన్నుల క్రిబ్–కో యూరియా చేరనుండగా, మూడు జిల్లాలకు 1,500, 300, వేయి మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో మిగిలే 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా గోదాంల్లో భద్రపరుస్తామని వెల్లడించారు.