
కాంగ్రెస్‌లో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునిచ్చేందుకే రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ (ఆర్‌జీపీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఆర్‌జీపీఆర్‌ఎస్ నిర్వాహకులు గంటా వినయ్ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆర్‌జీపీఆర్‌ఎస్‌పై పార్టీ శ్రేణులతో చర్చించాక వారు విలేకరులతో మాట్లాడారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారో వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, ఇందుకోసం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ఆర్‌జీపీఆర్‌ఎస్ ద్వారా పరిశీలన ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, నాయకులు దొబ్బల సౌజన్య, మహ్మద్ జావీద్ పాల్గొన్నారు.