
డెంగీ మరణాలు నమోదు కావొద్దు
ఖమ్మవైద్యవిభాగం: వైద్య రంగంలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేలా వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పర్యవేక్షిస్తూ డెంగీ మరణాలు నమోదు కాకుండా చూడాలని సూచించారు. డెంగీ కేసులను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదని, ఎన్ని కేసులు గుర్తించి చికిత్స చేస్తే అంత బాగా పని చేసినట్లు పరిగణిస్తామని తెలిపారు. జిల్లా ఆస్పత్రికి తాకిడి పెరుగుతుందంటే పీహెచ్‌సీల పనితీరు సరిగ్గా లేనట్లే భావించాల్సి వస్తుందన్నారు. ఇటీవల పలు ఆస్పత్రుల్లో తనిఖీ సందర్భంగా అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను మరింత వినియోగించాల్సి ఉందని గుర్తించానని తెలిపారు. ప్రతీ పీహెచ్‌సీకి అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు సమకూర్చుకోవడంతో పాటు ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. వైద్య నిపుణులు ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్... అధికంగా ప్రసవాలు జరిగే ఐదు పీహెచ్‌సీలను 24 గంటల పీహెచ్‌సీలుగా మార్చేలా ప్రతిపాదించాలని సూచించారు.
ఉద్యోగుల హాజరు ఆన్‌లైన్‌లో..
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగుల హాజరును ఆగస్టు 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేకుండా గైర్హాజరు, ఆలస్యంగా రావడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, డిప్యూటేషన్ ఆస్పత్రి అవసరాలకే తప్ప ఉద్యోగుల సౌలభ్యం కోసం ఉండొద్దని తెలిపారు. ఈమేరకు ల్యాబ్ టెక్నీషియన్ల డిప్యూటేషన్ రద్దు చేసి కేటాయించిన ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, ఆస్పత్రులు సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు చేయూత
రఘునాథపాలెం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంత వేగంగా చేపడితే అంత త్వరగా బిల్లులు విడుదలవుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్‌లో ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణదారులకు ఆర్థిక సాయం అందించడమే కాక ఉచితంగా ఇసుక రవాణా చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయాన లబ్ధిదారులకు ఆర్థిక సాయంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దశల వారీగా పనులు పూర్తికాగానే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఆతర్వాత వనమహోత్సవంలో భాగంగా మెగా బ్లాక్ ప్లాంటేషన్ కోసం రఘునాథపాలెం మండలం జింకలతండా గుట్ట వద్ద స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్, ఉద్యోగులు ప్రవీణ్, పద్మయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో సరైన సేవలు అందకే
జిల్లా ఆస్పత్రిలో రద్దీ
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో
కలెక్టర్ అనుదీప్

డెంగీ మరణాలు నమోదు కావొద్దు