మాకో సీటు కావాలి! | - | Sakshi
Sakshi News home page

మాకో సీటు కావాలి!

Jul 30 2025 7:18 AM | Updated on Jul 30 2025 7:18 AM

మాకో సీటు కావాలి!

మాకో సీటు కావాలి!

ఒక్కో స్టేషన్‌లో ఐదుగురు

జిల్లా కేంద్రంతో పాటు ముఖ్యపట్టణాల్లో పోలీసుస్టేషన్లను శాంతిభద్రతల పర్యవేక్షణ, కేసుల సత్వర విచారణ కోసం అప్‌గ్రేడ్‌ చేశారు. ఆయా పీఎస్‌లకు ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలను నియమించడమే కాక ఒక్కో స్టేషన్‌లలో ఐదుగురి నుంచి ఆరుగురు ఎస్సైలను కేటాయించారు. తద్వారా వాహనాల తనిఖీ, కేసుల విచారణ, ఇతర పనులన్నీ సాఫీగా, సులువుగా సాగిపోతున్నాయి.

కూర్చోవడానికి కుర్చీలు ఏవీ?

ఖమ్మంలోని వన్‌, టూ, త్రీ టౌన్‌ పీఎస్‌లే కాక ఖానాపురం, రఘునాథధపాలెం, ఖమ్మం రూరల్‌, ముదిగొండ, మధిర పోలీస్‌స్టేషన్లను దశల వారీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందులో వన్‌, టూ, త్రీ టౌన్‌ పీఎస్‌లతోపాటు ఖానాపురం హవేలీ పోలీస్‌ స్టేషన్‌కు కొన్నేళ్ల క్రితమే ఎస్‌హెచ్‌ఓగా సీఐ స్థాయి అధికారిని నియమించారు. దీంతో అప్పటివరకు స్టేషన్‌ ఇన్‌చార్జ్‌గా కొనసాగిన ఎస్‌ఐలు సిబ్బందిలో ఒకరిలా మారాల్సి వచ్చింది. అంతేకాక ఐదుగురి వరకు ఎస్సైలను కేటాయించి స్టేషన్‌ పరిధిని సెక్టార్లుగా విభజించి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అప్‌గ్రేడ్‌ అయిన ఠాణాల్లో ఎస్‌ఐ స్థాయి అధికారులు కూర్చోవడానికి కుర్చీలు లేక ఒకే గదిలో నలుగురి నుంచి ఐదుగురు కూర్చోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో చేసేదేం లేక కింది స్థాయి సిబ్బంది కుర్చీలో సర్దుకుంటుండగా వారికి ఇక్కట్లు మొదలయ్యాయి. ఫలితంగా కొందరు ‘మా ఆరోగ్యమే బాగా లేక ఇబ్బంది పడుతున్నాం.. ఇప్పుడు మీరు మా కుర్చీల్లో కూర్చుంటే మేం నిలబడాలా’ అని ఎస్‌ఐల ముఖం పట్టుకుని అంటున్నట్లు తెలిసింది.

త్రీటౌన్‌లో ప్రత్యేక గదులు

ఎస్‌ఐల ఇక్కట్లు చూడలేక ఖమ్మం త్రీటౌన్‌ స్టేషన్‌ ఆవరణలో రేకులతో గదులు నిర్మిస్తున్నారు. ఇదే తరహాలో మిగతా స్టేషన్లలోనూ నిర్మిస్తే తప్ప ఎస్సైల ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశంలేదు. ఉన్నతాధికారులు ఈ దిశగా ఆలోచించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

పలు పీఎస్‌ల్లో ఎస్సైలకు కుర్చీలు కరువు

ఎస్‌హెచ్‌ఓ ఠాణాలన్నింటా

ఇదే పరిస్థితి

ఎస్‌ఐ ఉద్యోగం అంటే ఆ ఠీవి, హుందానే వేరు. ఈ కొలువుకు ఉన్న స్థాయి అంతాఇంతా కాదు. కానీ ఇదంతా గతకాల వైభవంగా మారిపోతోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా

కేంద్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లతో పాటు ముఖ్యపట్టణాల్లోని పీఎస్‌లను సైతం శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. తద్వారా అక్కడ ఎస్సైలకు బదులు సీఐ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌ఓ(స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఎస్సైల సీటుకు ముప్పు తెచ్చిపెట్టినట్లయింది. – ఖమ్మంక్రైం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement