
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నేలకొండపల్లి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం నేలకొండపల్లి మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేయనుండగా, వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటుతారు. అలాగే, పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈకార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు ఓ ప్రకటనలో కోరారు.
గురుకుల కళాశాలల్లో రేపు స్పాట్ కౌన్సెలింగ్
ఖమ్మంమయూరిసెంటర్: జోన్–4 పరిధిలోని గురుకుల కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జోనల్ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు 2025లో ఎస్‌ఎస్‌సీ, సీబీఎస్‌ఈ, సీఎస్‌ఈ నుంచి ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. హాజరైన విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే సబ్జెక్టుల వారీగా మార్కులను పరిగనణలోకి తీసుకుంటామని తెలిపారు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్స్‌లు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఆర్‌సీఓ తెలిపారు.
స్థానిక, సంస్థాగత
ఎన్నికలపై సమీక్ష
ఖమ్మంమయూరిసెంటర్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌లో మంగళవారం నాయకులతో సమీక్షించారు. టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ కూడా పాల్గొనగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పోదెం వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత, పార్టీ మండల, జిల్లా కమిటీల నియామకంపై చర్చ జరిగిందని వారు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి చల్లా వంశీచంద్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి, నాయకులు బేబీ స్వర్ణకుమారి, చక్కిలం రాజేశ్వరరావు, దైదా రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
వేగంగా హెచ్‌టీ సర్వీసుల మంజూరు
ఖమ్మంవ్యవసాయం: వినియోగదారులకు హెచ్‌టీ 11 కేవీ, 33కేవీ, ఆపై ఓల్టేజీ సర్వీసుల మంజూరు వేగంగా జరగడానికి సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతోందని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మంజూ రును సరళీకృతం చేసేలా సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. వినియోగదారులు అవసరమైన పత్రాలతో దరఖాస్తులను ఎన్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా సమర్పిస్తే అధికారులు పరిశీలించి అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.
‘నవోదయ’ దరఖాస్తు గడువు పొడిగింపు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయతో పాటు భద్రాద్రి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్ట్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాలేరు ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. పాలేరులో 80, భద్రాద్రి జిల్లాలోని విద్యాలయలో 40 సీట్లు భర్తీ చేయనున్నందున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.