● ప్రతిపాదనలకే పరిమితమైన ప్రక్రియ ● టెండర్లపై మీనమేషాలు ● ఎదురుచూపుల్లో మత్స్యకారులు
ఖమ్మంవ్యవసాయం: చేపపిల్లల ఉచిత పంపిణీలో జాప్యం మత్స్యకారులను ఆవేదనకు గురిచేస్తోంది. మత్స్యశాఖ సమర్పించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఆమోదముద్ర వేస్తేనే టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. ఆతర్వాత కాంట్రాక్టర్ల ఎంపిక, చేపపిల్లల సేకరణ, సరఫరా జరగాల్సి ఉండడంతో అదును దాటుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మత్స్యకారుల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి కోసం 2018–19 నుంచి ఉచిత చేపపిల్లల పథకం అమలవుతుండగా, ఏటా ఏప్రిల్‌లోనే టెండర్లు నిర్వహించి జూలై, ఆగస్టు నెలల్లో చెరువులు, కుంటల్లో పిల్లలు వదులుతారు. అయితే, బకాయిలు పేరుకుపోయాయని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో గత ఏడాది ఆగస్టు తర్వాతే పిల్లల పంపిణీ మొదలైంది. ఇక ఈసారి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యాన, ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేయనుంది.
నిండుకుండల్లా జలాశయాలు
ఇటీవలి వర్షాలతో జిల్లాలోని జలాశయాలన్నీ నిండాయి. చెరువులు, కుంటలు నిండినా చేపపిల్లల పంపిణీ టెండర్ల దశకు చేరలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం చేపపిల్లల పథకానికి ఆమోదముద్ర వేస్తే మత్స్యశాఖ టెండర్ల ప్రక్రియ చేపడుతుంది. ఆగస్టు మొదటి, రెండు వారాల్లో టెండర్లు నిర్వహించినా ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి చేపపిల్లల సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది.
జిల్లాకు 3.68 కోట్ల చేపపిల్లలు
జిల్లాలో 880 చెరువులు, కుంటల్లో 3.68 కోట్ల చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.5.50కోట్ల మేర నిధులు అవసరమని అంచనా. కాగా, 3.68కోట్ల పిల్లల్లో 1.40కోట్లు 35–40 మి.మీ., 2.28కోట్ల పిల్లలు 80–100మి.మీ.వి కావాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. చిన్న చేపపిల్ల ఖరీదు రూ.0.60, పెద్దవైతే రూ.1.50 వరకు ఉంటుంది. గత ఏడాది ఇదే ధరలతో టెండర్లు ఖరారయ్యా యి. చిన్నపిల్లలో బొచ్చ, రవ్వ, బంగారుతీగ, పెద్ద పిల్లల్లో బొచ్చ, రవ్వ, మృగాలు రకాలు ఉంటాయి. గత ఏడాది వరదల కారణంగా జిల్లాలో 2.68 కోట్ల చేపపిల్లలను 876 జలాశయాల్లో వదిలారు.
16వేల కుటుంబాలకు జీవనోపాధి
జలాశయాల్లో చేపపిల్లల పెంపకం ద్వారా జిల్లాలో 220మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 16వేల మత్స్య కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. పరోక్షంగా మరికొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. గతంలో సంఘాల ఆధ్వర్యాన చేపపిల్లలను కొనుగోలు చేసి జలాశయాల్లో వదిలేవారు. ఆ తర్వాత ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుండడంతో లబ్ధి జరుగుతుండగా, రెండేళ్ల నుంచి జాప్యంతో సమస్యలు మొదలయ్యాయి. ఈసారైనా సకాలంలో జలాశయాల్లోకి చేపపిల్లలు చేరేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.
జలాశయాలు అనుకూలం
చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వగానే టెండర్లు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా జలాశయాలు చేపపిల్లలను వదిలేందుకు అనుకూలంగా ఉన్నాయి.
– శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
చేపపిల్లల పంపిణీ ఎప్పుడు?