
భూసేకరణ వేగవంతం చేయాలి
ఖమ్మంఅర్బన్: జిల్లాలో చేపట్టిన కీలక అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఖమ్మం రూరల్, అర్బన్ మండలాల్లోని రైతులు అంగీకరించిన స్థలాల్లో పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా లేఔట్ ప్లాట్‌లు కేటాయించడమే కాక, వాటిలో అంతర్గత రహదారులు, స్ట్రీట్‌లైట్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. లేఔట్‌లో 10 మీటర్ల వెడల్పు గల బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్‌ను తుది రూపంలోకి తీసుకురావాలని, హైదరాబాద్‌లోని ప్రైవేట్ లేఔట్ల తరహాలోనే లేఔట్‌ను అభివృద్ధి చేయాలని అన్నారు. పనులన్నింటికీ స్పష్టమైన గడువును నిర్దేశించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, నేషనల్ హైవే మేనేజర్ దివ్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి
ఖమ్మంవైద్యవిభాగం : మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. జిల్లాలో 4 ఏరియా ఆస్పత్రులు, 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు వీవీపీ ద్వారా పని చేస్తున్నాయని చెప్పారు. సత్తుపల్లి, మధిర, కల్లూరు ఏరియా ఆస్పత్రుల నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వైద్యుల హాజరు సక్రమంగా ఉండాలని, రెండు రోజుల్లో వైద్యులంతా ఆధార్ ఆధారిత హాజరు యాప్‌లో నమోదు కావాలని సూచించారు. ఆస్పత్రుల్లో అవసరైమన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, వైద్యశాఖ ఈఈ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి