
స్తంభాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో 18వ వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం హోమం తదితర పూజలు చేశారు. ఆగస్టు 2వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జల విద్యుదుత్పత్తి ప్రారంభం
కూసుమంచి : పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి బుధవారం ప్రారంభమైంది. ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఒక యూనిట్‌కు ట్రయల్‌రన్ నిర్వహించగా అది విజయవంతం అయింది. దీంతో ఆ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. ఎడమ కాల్వకు నీటి విడుదల పెంచిన తర్వాత రెండో యూనిట్‌ను ప్రారంభిస్తామని, ఈలోపే ట్రయల్ రన్ చేస్తామని అధికారులు తెలిపారు.
మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలి
చింతకాని : రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని విద్యుత్ శాఖ ఏస్‌ఈ శ్రీనివాసాచారి అన్నారు. మండలంలోని ప్రొద్దుటూరులో బుధవారం నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొలంబాట ద్వారా వ్యవసాయ విద్యుత్ లైన్లకు సంబంధించిన ఒరిగిన స్తంభాలను సరిచేయడం, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను మార్చటం, వేలాడుతున్న వైర్లను సరిచేయడం వంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తిలక్, ఏఈ చావా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
‘న్యాస్’లో జిల్లాకు మూడో స్థానం
ఖమ్మం సహకారనగర్ : 2024 – 25 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నైపుణ్యానికి సంబంధించి నిర్వహించిన న్యాస్ (నేషనల్ ఎచివ్‌మెంట్ సర్వే–జాతీయ ప్రతిభ పరీక్ష) ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానం సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో సీఎం సలహాదారు కే.కేశవరావు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ తదితరులు అభినందించారు. అలాగే ఉత్తమ బోధన అంశంలో ఎన్నెస్సీ కాలనీ ఉపాధ్యాయులు రాజేష్, ఉమను కూడా అభినందించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన సీపీ
ఖమ్మంక్రైం: ప్రకాష్ నగర్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీపీ సునీల్‌దత్ బుధవారం సందర్శించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పనితీరును పరిశీలించారు. వర్షాలతో దెబ్బతిన్న సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణలో కీలకంగా పనిచేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఆర్‌ఐ కార్యాలయాల ప్రారంభం
పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆధునికీకరించిన సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయాలను సీపీ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఎఆర్ ఏసీపీలు సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్ నాగుల్ మీరా పాల్గొన్నారు.

స్తంభాద్రి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం