
మహిళల పేరిటే పథకాలు
నేలకొండపల్లి : రాష్ట్రంలో అత్యధిక సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అమలు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లి డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటారు. ఆ తర్వాత రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పేదల కష్టాలను చూసిన ప్రభుత్వం.. వారికి భరోసా కల్పించేలా పాలన సాగిస్తోందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీతో రూ.25.65 కోట్లు అందించామని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. జిల్లాలో 19,690 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హత ఉన్న వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, భద్రయ్య, రావెళ్ల కృష్ణారావు, కొర్లకుంట్ల నాగేశ్వరరావు, పగిళ్ల పృథ్వీ, కడియాల నరేష్, కొమ్మినేని విజయ్‌బాబు, గుండా బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి