ఖమ్మంమామిళ్లగూడెం: జిల్లాలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యాన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే కాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పీఠాన్ని సైతం కై వసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పర్యటన కోసం మంగళవారం వచ్చిన ఆయనకు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆపై ఖమ్మం కాల్వొడ్డు, మయూరిసెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక ర్యాలీగా ఇల్లెందు క్రాస్‌రోడ్, బైపాస్ మీదుగా పార్టీ జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాంచందర్‌రావు చేరుకున్నారు.
అభివృద్ధి జాడలేవి?
జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి జరగడం లేదని ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. ఏ మంత్రి కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రప్రభుత్వం అమృత్ పథకం కింద రూ.450 కోట్లను ఖమ్మం అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు. ఖమ్మంలో నాలుగు జాతీయ రహదారులు కూడా కేంద్రం చొరవతో వచ్చాయని చెప్పారు. ఖమ్మంను నిన్నామొన్నటి వరకు కమ్యూనిస్టుల అడ్డాగా చెప్పగా.. రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారనుందని తెలిపారు. జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశం, ధర్మం, జాతి, సమాజంతోపాటు రైతుల కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని రాంచందర్‌రావు వెల్లడించారు. ఈ సమ్మేళనంలో జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను వివరించారు. అనంతరం ఖమ్మం ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద బీజేపీ కార్యాలయాన్ని రాంచందర్‌రావు ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ రంగాల మేధావులతో సమావేశమై చర్చించారు. బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు తాండ్ర వినోద్‌రావు, సన్నె ఉదయ్‌ప్రతాప్, దేవకి వాసుదేవరావు, గెంటేల విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, గల్లా సత్యనారాయణ, నంబూరి రామలింగేశ్వరరావు, వాకదాని పుల్లారావు, అల్లిక అంజయ్య, డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, నున్నా రవి, విజయరాజు, రుద్రగాని ప్రదీప్, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీనీ కై వసం చేసుకుంటాం..
ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం