● కారేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో కలెక్టర్ అనుదీప్ ● పీహెచ్‌సీ, సొసైటీ గోదాంల్లోనూ తనిఖీ
కారేపల్లి: చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని.. తద్వారా గౌరవం లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించి క్రమశిక్షణతో పట్టుదలగా చదవాలని సూచించారు. కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణమంతా పరిశీలించిన ఆయన పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, పుస్తకాలు, విద్యార్థుల యూనిఫామ్, క్రీడా సామగ్రి నిల్వ ఉంచే గదుల్లోనూ శుభ్రత లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులకు సూచనలు చేసిన కలెక్టర్ పలు పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ వారి ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, మధ్యాహ్న భోజనం నాణ్యతపైనా ఆరా తీశారు. అనంతరం కారేపల్లి పీఏసీఎస్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల లభ్యత, సరఫరా ఆరా తీశాక సిబ్బందికి సూచనలు చేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ అనుదీప్.. పలువురితో మాట్లాడి అందుతున్న వైద్యసేవలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా వైద్యులు కృషి చేయాలని, సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి సారించాలని ఆదేశించారు. తహసీల్దార్ అనంతుల రమేష్, ఇన్‌చార్జి ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంఈఓ జయరాజు, హెచ్‌ఎం శ్యాంప్రసాద్, ఏఓ భట్టు అశోక్‌కుమార్, వైద్యాధికారి బి.సురేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్, సొసైటీ సీఈఓ బి హన్మంతరావు పాల్గొన్నారు.
నాణ్యమైన గేదెల కొనుగోలు
ఖమ్మంవ్యవసాయం: మధిరలో ఏర్పాటుచేసే ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులతో నాణ్యమైన, ఆరోగ్యవంతమైన గేదెలే కొనుగోలు చేయించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అధిక పాల దిగుబడి వచ్చే రకాలు ఎంపిక చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఏపీలోని తుని, తణుకు, ఉండి, కంకిపాడు తదితర సంతల్లో అధికారులు పరిశీలించి మొదటి విడతగా 250 గేదెల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ బృందంలో 25 మంది లబ్ధిదారులు, నలుగురు అధికారులు వెళ్లాలని తెలిపారు. ఈసమావేశంలో డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, జిల్లా పశు సంవర్థక అధికారి డాక్టర్ పురందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్, ఏడీఏ విజయచందర్, ఎఫ్‌డీఓలు మంజుల, వెంకన్న పాల్గొన్నారు.