
దంపతులతో దాగుడుమూతలు
● సంతానం లేని వారే లక్ష్యంగా దందా ● విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న సంతాన సాఫల్య కేంద్రాలు ● అనుమతులు లేకున్నా యథేచ్ఛగా నిర్వహణ ● అమాయకుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్న యాజమాన్యాలు
సంతాన సాఫల్యతకు ఇవీ మార్గాలు
● ఐయూఐ (ఇంట్రా యూటిరిన్ ఇన్‌సెమినేషన్) : ఈ విధానంలో భర్త శుక్రకణాలను సేకరించి కదలిక మంచిగా ఉన్న వాటిని సిరంజీ ద్వారా భార్య గర్భసంచిలోకి ప్రవేశపెడతారు.
● ఐవీఎఫ్ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్) : ఇందులో మహిళ అండాన్ని ల్యాప్రోస్కోపిక్ ద్వారా తీసి ప్రిజర్వ్ చేస్తారు. ఆపై భర్త వీర్యకణాలు తీసి బయటే అండం, శుక్రకణాలను ఫలధీకరణం చేశాక అండాలను గర్భసంచిలో ప్రవేశపెడతారు.
● సరోగసీ : భార్య గర్భం దాల్చే అవకాశం లేదని తేలినప్పుడు ఈ విధానం ఎంచుకుంటారు. భర్త శుక్రకణాలు, భార్య అండాలను ఫలదీకరించి మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఈ విధానంలో చికిత్స చేసే ఆస్పత్రులకు జిల్లా స్థాయి కమిటీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలో సంతాన సాఫల్య కేంద్రాలు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుత జీవనశైలి, వాతావరణ పరిస్థితులతో పాటు ఇతర కారణాలతో సంతాన లేమి సమస్య ఎదురవుతుండగా.. పిల్లలు లేని జంటలే లక్ష్యంగా కేంద్రాల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఆతర్వాత ఫలితం లేకపోతే తమ తప్పేం లేదని చేతులు దులుపుకుంటుండడందంపతులు కన్నీటికి కారణమవుతోంది. అయితే, కేంద్రాల ఏర్పాటుకు కొందరే అనుమతి తీసుకుంటుండగా.. అనుమతులు లేనివి లెక్కలేనన్ని పుట్టుకొస్తుండడం గమనార్హం.
పదింటికే అనుమతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఏడు సంతాన సాఫల్య కేంద్రాలకు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి ఉంది. ఖమ్మం జిల్లాలో రోహిత్ టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్, ప్రవీణ ఫెర్టిలిటీ సెంటర్, మాతృశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, శ్రీగర్భ ఫెర్టిలిటీ సెంటర్, శ్యామల హాస్పిటల్, వింగ్స్ జోయా ఐవీఎఫ్ సెంటర్, కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు అనుమతి ఉండగా.. ఇందులో రోహిత్, ప్రవీణ సెంటర్లకు సరోగసీ అనుమతులు ఉన్నాయి. కానీ ఉమ్మడి జిల్లాలో ముప్ఫైకి పైగా సెంటర్లు కొనసాగుతుండడం అధికారుల పర్యవేక్షణ లేమిని తెలియజేస్తోంది.
మరిచిపోయారా?
గత ఏడాది మార్చిలో సంతాన సాఫల్య కేంద్రాల తీరుపై హెల్త్ అండ్ ఫ్యామిటీ వెల్ఫేర్ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఖమ్మంలోని సెంటర్లలో హైదరాబాద్ అధికారులు తనిఖీ చేపట్టారు. అప్పుడు రెండు ఫెర్టిలిటీ సెంటర్లను సీజ్ చేయడమే కాక ఐదు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ఆతర్వాత రాష్ట్ర, జిల్లా అధికారుల తనిఖీ లేకపోవడంతో దందా అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతోంది.
కమీషన్లతో వ్యవహారం
వివాహం జరిగి ఏళ్లు గడిచినా సంతానం లేని దంపతులే టార్గెట్‌గా నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వంటి పేర్లతో ఏర్పాటుచేస్తున్న కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటే బిడ్డ జన్మించడం గ్యారంటీ అని నమ్మిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అనుమతి ఉన్నవేవో, లేనివేవో తెలియక సూర్యాపేట, మహబూబాబాద్‌తో పాటు తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్, ఏపీలోని పలు జిల్లాల నుంచి దంపతులు సంతానంపై ఆశతో వస్తున్నారు. దంపతులను పంపిస్తే ఆర్‌ఎంపీలు, వైద్యులకు కమీషన్లు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.
అతి తక్కువ ‘సక్సెస్ రేట్’
దంపతుల్లో సంతాన లేమికి అనేక కారణాలు ఉంటాయి. దంపతులెవరైనా సంతానం లేదని వస్తే వైద్యులు అందుకు కారణాలను నిర్ధారించి వివరించాల్సి ఉంటుంది. కానీ చికిత్స చేస్తే సంతానం గ్యారంటీ అని నమ్మబలికి వసూళ్లు మొదలుపెడుతున్నారు. దీంతో అటు కుటుంబం, ఇటు సమాజం నుంచి సూటిపోటి మాటలు భరిస్తున్న దంపతులు ఆస్తులు అమ్మి మరీ చెల్లిస్తున్నారు. కాగా, టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లలో 10 – 15 శాతమే సక్సెస్ రేట్ ఉంటుందని నిపుణులు చెబుతుండగా.. సెంటర్ల నిర్వాహకులు ఆదాయమే లక్ష్యంగా చికిత్స కొనసాగిస్తున్నారని సమాచారం.
హైదరాబాద్ ఘటనతో సందేహలు
హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌లో దంపతులను మోసగించిన ఘటన ఇటీవల బయటపడింది. సరోగసీ పేరుతో ఇతరులకు పుట్టిన శిశువును అప్పగించిన వైద్యురాలి మోసం బయటపడగా.. ఆ సెంటర్‌కు లైసెన్సే లేనట్లు తేలింది. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లలో జరుగుతున్న చికిత్సపై సందేహలు వెల్లువెత్తుతున్నాయి. చాలా సెంటర్లు అనుమతి లేకున్నా కొనసాగుతుండడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఫెర్టిలిటీ సెంటర్లలో నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తప్పవు. అమాయకులైన దంపతులకు హానీ కలిగించేలా వ్యవహరించొద్దు. అనుమతి ఉన్న సెంటర్ల నిర్వాహకులైనా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. జిల్లాలోని అన్ని సెంటర్లను తనిఖీ చేసి నిబంధనల అమలును పరిశీలిస్తాం.
– బి.కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ

దంపతులతో దాగుడుమూతలు