
ఖాళీల లెక్క తేలింది...
జిల్లాలో టీచర్ పోస్టులు 892ఖాళీ
ఖమ్మం సహకారనగర్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యాన ఈనెల 31వ తేదీన పలువురు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ఉద్యోగ విరమణ చేయనుండగా విద్యాశాఖ అధికారులు ఖాళీల లెక్క తేల్చేలా కసరత్తు ఆరంభించారు. జిల్లాలో మొత్తం 5,816 పోస్టులకు గాను 4,924మంది విధులు నిర్వర్తిస్తుండగా 858 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల ప్రకటించగా, ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న వారితో కలిసి ఆ సంఖ్య 892కి చేరింది. కాగా, పదోన్నతుల షెడ్యూల్ మంగళవారం విడుదలయ్యే అవకాశముందని సమాచారం. షెడ్యూల్ ప్రకారం సీనియారిటీ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు.