
సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అజయ్
కల్లూరు: కల్లూరు సబ్ కలెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కల్లూరు డివిజన్‌ను ఇటీవల అప్‌గ్రేడ్ చేయగా 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజయ్‌ను సబ్ కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాకు చెందిన ఆయన ఢిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాక సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఐఏఎస్ శిక్షణ అనంతరం కరీంనగర్‌లో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేయగా, తొలిపోస్టింగ్ కల్లూరులో కేటాయించారు. ఈ సందర్భంగా అజయ్‌యాదవ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారం, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. తొలుత ఆయనకు ఆర్‌డీఓ రాజేందర్‌తో పాటు కార్యాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
కూసుమంచి: కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న పథకాలను ఎన్‌ఎల్‌ఎం అధికారుల బృందం సోమవారం పరిశీలించింది. ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులతో చర్చించడమే కాక రికార్డులను పరిశీలించారు. అలాగే, పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆపై అంగన్‌వాడీ కేంద్రాలు, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు, సీసీ రహదారులను పరిశీలించి నిర్మాణ వివరాలపై అధికారులతో చర్చించారు. ఈ బృందంలో డాక్టర్ డీ.డీ.గరుడ, ఏ.అశ్విన్ గోపాల్ ఉండగా, ఈజీఎస్ ఏపీడీలు చలపతిరావు, శ్రీదేవి, డీఎల్‌పీఓ రాంబాబు, కూసుమంచి ఎంపీడీఓ రాంచందర్‌రావు, ఏపీఓ అప్పారావు, ఏపీఎం తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు మరో 1,085
మెట్రిక్ టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లా అవసరాల కోసం సోమవారం 1,085 మెట్రిక్ టన్నుల స్పిక్ యూరియా చేరింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు యూరియాతో కూడిన గూడ్స్ రాగా, మార్క్‌ఫెడ్ గోదాములకు తరలించారు. ఇందులో 650 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్‌గా నిల్వ చేయనుండగా, మిగతా 435 మెట్రిక్ టన్నుల్లో 235 టన్నులు ఖమ్మం జిల్లాకు, 200 టన్నులు భద్రాద్రి కొత్తగూడెంకు కేటాయించారు. ఇక మంగళవారం కాంప్లెక్స్ 20:20 ఎరువుతో కూడిన రైలు, బుధవారం మరో 1,300 మెట్రిక్ టన్నుల క్రిబ్‌కో యూరియా రానుందని అధికారులు తెలిపారు.
ప్రకాష్‌నగర్
వంతెనపై పగుళ్లు..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నుంచి రాకపోకలకు ప్రధాన మార్గంగా మున్నేరుపై ఉన్న ప్రకాష్‌నగర్ వంతెన భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది మున్నేటికి వచ్చిన భారీ వరదతో వంతెనపై పలుచోట్ల స్పైన్లు కదలగా రాకపోకలు నిలిపేసి రూ.కోటి వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే, వంతనపై మళ్లీ పగుళ్లు వచ్చినట్లు తెలుస్తుండగా సోమవారం కొందరు వాహనదారులు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో వంతెన భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేర్ కోటింగ్‌లో ఏర్పడిన పగుళ్లే...
బ్రిడ్జిపై పగుళ్లు వచ్చాయనే సమాచారంతో ఆర్ అండ్ బీ డివిజన్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంతెనపై కనిపిస్తున్నవి కాంక్రీట్ లేదా స్పైన్లలో వచ్చిన పగుళ్లు కావని తేల్చిచెప్పారు. వంతెన శ్లాబ్ పైభాగంలో వేసే వేర్ కోటింగ్‌లో ఏర్పడిన అల్పస్థాయి పగుళ్లేనని, వీటితో వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అయినప్పటికీ మంగళవారం మరోసారి వేర్ కోటింగ్ చేయిస్తామని వెల్లడించారు.

సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అజయ్

సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అజయ్