
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత
● టెంపుల్, ఎకో టూరిజం ప్రాజెక్టులకు ప్రణాళికలు ● అధికారులతో సమీక్షలో మంత్రులు తుమ్మల, జూపల్లి
ఖమ్మంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రులు సోమవారం పర్యాటక ప్రాజెక్టులపై సమీక్షించారు. టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా మంత్రులు మాట్లాడారు.
అపారమైన అవకాశాలు
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. పాలేరు రిజర్వాయర్, భద్రాచలం రామాలయం, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్టు, ఖమ్మం ఖిల్లా, వెలుగుమట్ల పార్క్, వైరా రిజర్వాయర్, కనిగిరి హిల్స్, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం తదితర ప్రదేశాలకు వన్నెలద్ది వసతులు కల్పిస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని చెప్పారు. అంతేకాక టెంపుల్, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించినట్లవుతుందని తెలిపారు. ఖమ్మం సమీపాన సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే కాక కొత్తగూడెం హరిత హోటల్‌ను పూర్తిచేసి ఖమ్మంలోనూ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు చేపట్టే అవకాశముందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెల ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యాన పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని తుమ్మల, జూపల్లి కృష్ణారావు సూచించారు.