జాతీయవాదులపై దాడి గర్హనీయం
ఖమ్మం మామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై ఆర్మీ జవాన్లకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న జాతీయవాదులపై దాడి చేయడం గర్హనీయమని మాజీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన యాత్రలో చోటుచేసుకున్న ఘటనతో గాయపడిన బీజేపీ లీగల్ అడ్వైజర్ వెంకట్ గుప్తాను వారు శనివారం పరామర్శించారు. అనంతరం దళితమోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా, లీగల్‌సెల్ అడ్వైజర్ రమేష్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంత్రుల అండతోనే ఖమ్మంలో జాతీయవాదులపై దాడి జరిగినట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ముస్లింల కోసమేనంటూ జిల్లాకు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలపై ిపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరిగిన దాడిని ముగ్గురు మంత్రులు ఎందుకు ఖండించలేదో చెప్పాలన్నారు. కాగా, ఈనెల 25న మహిళామణుల ఆధ్వర్యాన జరిగే సిందూర్ యాత్రకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, నంబూరి రామలింగేశ్వరావు, రామారావు, విజయరాజు, వీరెల్లి రాజేష్ గుప్త, అల్లిక అంజయ్య పాల్గొన్నారు.


