
భూసేకరణ పూర్తి చేయాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పెండింగ్ భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్నేటి తీరాన నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్, సీతారామ ఎత్తిపోతల పథకం, జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణ సకాలంలో పూర్తిచేస్తేనే పనులకు ఆటంకాలు రావని తెలిపారు. ఈ విషయంలో రైతులు, నిర్వాసితులతో నేరుగా చర్చించి వారికి నచ్చచెప్పాలని సూచించారు. అలాగే, సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా యాతాలకుంట టన్నెల్, పాలేరు రిజర్వాయర్ లింక్, డిస్ట్రిబ్యూషన్ కెనాళ్లకు అవసరమైన భూసేకరణపైనా సూచనలు చేశారు. కాగా, భూసేకరణ, రైతులకు పరిహారం అందించే అంశంలో మానవీయ కోణంలో వ్యవహరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. ఈసమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేంద్రగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి