పరిసరాల పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిరక్షణ అందరి బాధ్యత

Jun 20 2026 11:19 AM | Updated on Jun 20 2026 11:19 AM

రాయచూరు రూరల్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాయచూరు వాకింగ్‌ క్లబ్‌ సంచాలకుడు సిద్ధేష్‌ విరక్తిమఠ్‌ సూచించారు. శుక్రవారం అంబేడ్కర్‌ గార్డెన్‌లో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్త వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. యోగా, ధ్యానం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రామణ్ణ, ముత్తురాజ్‌, చంద్రశేఖర్‌, నరసింహులు, అఫ్రోజ్‌ ఖాన్‌, శరణ బసవ, మునిరెడ్డి, రహీం, జాకీర్‌, మహదేవ్‌, బసవరాజ్‌, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

పార్వతమ్మ

సేవలు అమూల్యం

రాయచూరు రూరల్‌: నగర మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి భార్య పార్వతమ్మ సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని మాజీ విధాన పరిషత్‌ సభ్యుడు శంకరప్ప తెలిపారు. శుక్రవారం నగరంలోని వీరాంజనేయ కళ్యాణ మంటపంలో పార్వతమ్మ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శంకరప్ప మాట్లాడుతూ.. పాపారెడ్డి నగర సభ అధ్యక్షుడిగా, శాసన సభ్యుడిగా పని చేసేందుకు పార్వతమ్మ సహకారం అందించారన్నారు. ఏటా జరిగే ముంగారు మూన్నూరు కాపు ఉత్సవాల నిర్వహణకు సహకారం అందించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో శాంతప్ప, శాలం, చంద్రశేఖర్‌, రాఘవేంద్ర, నరస రెడ్డి, ఆంజనేయ, శ్రీనివాసులు నరసింహులు తదితరలు పాల్గొన్నారు.

కట్టుకున్న భర్తే కాలయముడు

యర్రగుడిలో మహిళ దారుణ హత్య

సాక్షి బళ్లారి: జీవితాంతం తోడు, నీడలా ఉంటానని ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తే భార్యను దారుణంగా హత్య చేశాడు. తాలూకాలోని మోకా సమీపంలోని యర్రగుడి గ్రామానికి చెందిన సుజాతమ్మ (45) అనే మహిళను భర్త ఆంజనేయులు దారుణంగా హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య సుజాతమ్మను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపడంతో యర్రగుడి గ్రామం ఉలికిపడింది. స్థానిక మోకా పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు.

నామఫలకాలు

కన్నడ భాషలో ఉండాలి

కేజీఎఫ్‌: రాబోయే 10 రోజుల్లో నగరసభ వ్యాప్తిలో దుకాణాలు, వ్యాపార కేంద్రాల ముందు నామఫలకాల్లో 60 శాతం కన్నడ భాషను తప్పనిసరిగా ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఆర్‌. రవి ఆదేశించారు. శుక్రవారం నగరసభ సభాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కెజీఎఫ్‌ తాలూకాలో కన్నడ భాష అమలు సరిగా లేదన్నారు. కన్నడ భాష అమలుకు ఇప్పటికే రెండు సార్లు సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అయినా స్పందన లేదన్నారు. బెమెల్‌, ఇతర సంస్థలు, శాఖల్లో కన్నడిగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఇవ్వడానికి సంబంధించి ఇప్పటికే బెమెల్‌ అధికారితో చర్చించినట్లు తెలిపారు. కోలారులో త్వరలో సమావేశం నిర్వహించి కన్నడ పర సంఘటనలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కన్నడ సంఘం తాలూకా అధ్యక్షుడు ప్రసన్న రెడ్డి, నవ కరవే రాష్ట్ర అధ్యక్షుడు రాజగోపాలగౌడ, తహసీల్దార్‌ భరత్‌, కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement