సాక్షి బళ్లారి: బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (బుడా) సర్వేయర్ లోకాయుక్తకు చిక్కారు. స్థలాల లేఅవుట్ ఫైళ్ల అనుమతుల మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు మెరుపు దాడి చేశారు. బాధితుడి నుంచి రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా సర్వేయర్ శాంతమూర్తి, ఆయన సహాయకుడు మహమ్మద్ సాజిద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రవీణ్ కుమార్, కుమార స్వామి, రఘనాథ్ బృందానికి చెందిన సింగిల్ లేఅవుట్, మల్టీ లేఅవుట్ ఫైళ్లకు అనుమతులు పొందడం, సంబంధిత పనులు చేయించేందుకు వీరేష్ అనే వ్యక్తి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకున్నాడు. ఇందులో భాగంగా లేఅవుట్ అనుమతి కోసం వీరేష్ దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత సర్వేయర్ శాంతమూర్తి ఇందుకోసం రూ.3.50 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే లంచం ఇచ్చేందుకు వీరేష్‌కు ఇష్టం లేకపోవడంతో నేరుగా లోకాయుక్త అధికారులను కలిసి సమస్యను చెప్పుకున్నాడు. వీరేష్ ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయంలో సర్వేయర్ శాంతమూర్తి తన సహాయకుడు మహమ్మద్ సాజిద్ సహాయంతో వీరేష్ నుంచి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటుండగా దాడి చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో లోకాయుక్త పోలీస్ సూపరింటెండెంట్ ఎన్.వాసుదేవ రామ, డిప్యూటీ సూపరింటెండెంట్లు సిద్దప్ప, ఎస్.బీలగి, సచిన్, ఎస్.చలవాది, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఎం.భావిమని తదితరులు పాల్గొన్నారు.
అవినీతి కేంద్రంగా ‘బుడా’
బళ్లారి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా) కార్యాలయంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతుండటం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నగరంలో ఏటేటా పెరుగుతున్న జనాభాకు తోడు కొత్త లేఔట్లు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు పెరిగిపోతున్నాయి. లేఅవుట్ల అనుమతుల ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తున్న బుడా కార్యాలయ సిబ్బంది లేఅవుట్ల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారులు, పాలకులు నేరుగా లంచాలు తీసుకుంటున్నారని లేఅవుట్ల యజమానులు బహిరంగంగానే చెబుతున్నారు. నూతన లేఔట్ల అనుమతులు, ఫైళ్లు క్లియరెన్స్ చేయడానికి చిన్న చిన్న అభ్యంతరాలు చూపిస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడుతున్నారు.
లోకాయుక్తకు చిక్కిన సర్వేయర్ శాంతమూర్తి, ఆయను సహాయకుడు మహమ్మద్ సాజిద్
స్థలాల లేఅవుట్ ఫైళ్ల అనుమతులకు లంచం డిమాండ్
బాధితుడి ఫిర్యాదుతో ఆకస్మికంగా దాడి
సర్వేయర్, ఆయన సహాయకుడిని
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు


