హాస్టల్‌ విద్యార్థిపై వీధి కుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థిపై వీధి కుక్క దాడి

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

హొసపేటె: విజయనగర జిల్లా మరియమ్మహళ్లి పట్టణంలో ఒక హాస్టల్‌ విద్యార్థిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం జరిగింది. కొండనాయకనహళ్లి గ్రామానికి చెందిన మైలారీ అనే హాస్టల్‌ విద్యార్థి బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా వీధి కుక్క దూకి కరచింది. గమనించిన స్థానికులు మైలారీని ఆ మొద్దుబారిన కుక్క నుంచి కాపాడారు. చికిత్స నిమిత్తం బాలుడిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

నాణ్యమైన విద్య

అందించేందుకు చర్యలు

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని రాయచూరు రూరల్‌ ఎమ్మెల్యే బసనగౌడ అన్నారు. శుక్రవారం రాయచూరు తాలూకాలోని గారలదిన్నె, అశాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నూతన తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 13 పాఠశాలలు, 8 కర్ణాటక పబ్లిక్‌ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యా సౌకర్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ కోస్గి తదితరులు పాల్గొన్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి

రాయచూరు రూరల్‌: రాయచూరు తాలూకా కడగం దొడ్డి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆర్టీసీ డివిజన్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్‌ బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సులు నడపాలని సూచించారు. యాపలదిన్ని, చంద్ర బండ తదితర ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా బస్సులు నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం డివిజన్‌ కంట్రోల్‌ అధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రంగనాథ్‌, వీరేష్‌, తిమ్మన గౌడ, నరసప్ప, ఆంజనేయ, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

29 వరకూ ఇంటింటి సర్వే

రాయచూరు రూరల్‌: ఓటర్ల జాబితాలో సవరణలపై అధికారులు చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపణ్ణ సజ్జన్‌ సూచించారు. జిల్లా అధికారి కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రచార జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఓటర్ల జాబితా సమీక్షలో సుమారు 2.50 లక్షల మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జూన్‌ 29 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటి సర్వేలు నిర్వహించాలని తెలిపారు. ముద్రిత ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, లోపాలను గమనించి ఇంటి యజమానులు సవరణలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, అధికారులు శంకర గౌడ, చంద్రశేఖర్‌ పవార్‌, వీరేష్‌ నాయక్‌, దండప్ప బిరదార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈతకెళ్లి యువకుడు మృతి

హుబ్లీ: ఈత కొట్టేందుకు క్వారీలోకి దిగిన యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా అమ్మినబావి వద్ద చోటు చేసుకుంది. మరెవాడ గ్రామ రాజు కడిదాళ (23) మృతుడు. ఈనెల 16వ తేదీన రాజు.. ఈత కొట్టేందుకు క్వారీ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మునిగి చనిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలియలేదు. రెండు రోజుల నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం క్వారీలో మృతదేహం తేలడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి చూడగా.. మృతుడు రాజు కడిదాళ అని నిర్ధారించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement