తుంగభద్ర వెలవెల.. రైతన్న విలవిల.. | - | Sakshi
Sakshi News home page

తుంగభద్ర వెలవెల.. రైతన్న విలవిల..

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

సాక్షి,బళ్లారి: దక్షిణ భారత దేశంలో అత్యంత ముఖ్యమైన జలాశయాల్లో ఒకటైన తుంగభద్ర డ్యాం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, మహబూబ్‌ నగర్‌ తదితర జిల్లాలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంకు ఎగువన వరణుడు ముఖం చాటేయడంతో డ్యాంలోకి నీరు చేరకపోవడంతో గత ఏడాది డ్యాంలో ఉంచిన 9.5 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్‌ రెండవ వారం లోపు డ్యాంలో నీరు చేరడం ఆనవాయితీగా ఉండేది.

నదీ పరివాహకంలో కురవని వర్షాలు

తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాలైన ఆగుంబె, మొరాళ, తీర్థహళ్లి, శివమొగ్గ తదితర పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పడటం, ఎగువన ఉన్న భద్ర డ్యాం పూర్తిగా నిండిన తర్వాత దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగేది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ, ఎగువన వర్షాలు కురవక పోవడంతో డ్యాంలోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో తుంగభద్ర డ్యాం వెలవెలపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాంలో దాదాపు 30 టీఎంసీలు నీరు ఉండటంతో పాటు ఇన్‌ఫ్లో కూడా భారీగా ఉండటంతో రోజు రోజుకు డ్యాంలో నీటి నిల్వ పెరిగి జూలై రెండవ వారంలోపు డ్యాం గేట్లు ఎత్తే పరిస్థితి ఏర్పడింది.

ఎల్‌నినో ప్రభావంతో దుష్పరిణామం

ప్రస్తుత ఏడాది వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ఎల్‌నినో ప్రభావం వల్ల కూడా వరుణుడి రాకపై దుష్పరిణామం చూపడంతో డ్యాంలోకి తగినంత నీటి నిల్వ చేరుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ దయనీయంగా కనిపిస్తుండటంతో ఆయకట్టులో పంటలు సాగు చేసే రైతులు ప్రతి రోజు డ్యాం వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తుంగభద్ర ఆయకట్టులో నీటి నిల్వ పెరగకపోతే బళ్లారి జిల్లాతో పాటు మూడు రాష్ట్రాల పరిధిలో 8 జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకరంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కూడా ఎన్నో ఏళ్లు జూలై నెలలో డ్యాంలోకి నీరు వచ్చి చేరిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కనిపించడంతో వర్షాలు ఏమేరకు కురుస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఖరీఫ్‌ సాగుకు రైతన్న సమాయత్తం

మే, జూన్‌ ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు చాలా మంది ఆయకట్టు రైతులు దుక్కి కూడా దున్ని ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు. పొలాలను దుక్కి దున్నడంతో విత్తనాలు, ఎరువులను కూడా రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే ఈ ప్రాంత రైతులు డ్యాంలో నీటి నిల్వ ఎప్పుడెప్పుడు పెరుగుతుందా? అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కాగా డ్యాంలో 33 గేట్లు పూర్తిగా మార్చివేశారు. డ్యాంలో గేట్లు అధ్వాన్నంగా ఉండటంతో నిపుణుల సూచనలతో డ్యాం గేట్లు, చైన్లు మార్చి, కొత్త గేట్లను ప్రారంభించేందుకు తేదీ కూడా ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పొరుగున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తారనే వార్తలు వస్తున్నాయి. డ్యాం గేట్లను అధికారికంగా ప్రారంభించేందుకు ఈనెల 25వ తేదీని ప్రకటించారు. డ్యాం గేట్లను అన్నింటినీ సిద్ధం చేసినందుకు రైతుల్లో సంతోషం నెలకొన్నప్పటికీ వరుణుడు ముఖం చాటేసి డ్యాంలోకి నీటి నిల్వ పెరగకపోవడంతో ఖరీఫ్‌లో సకాలంలో పంటలు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందా, లేదా? అని అన్నదాతలు అయోమయంలో ఉన్నారు.

డ్యాంకు ఎగువన నదీ పరివాహకంలో ముఖం చాటేసిన వరుణుడు

వర్షాల కోసం ఆయకట్టు రైతన్నల ఎదురు చూపులు

డ్యాంలో పెరగని నీటి నిల్వ, రైతుల్లో ఆందోళన

డ్యాంకు కొత్త 33 క్రస్ట్‌గేట్లు, చైన్ల ఏర్పాటు పనులు పూర్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement